30 years Of Aapadbandhavudu: కళాతపస్వి కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ముచ్చటగా మూడు చిత్రాలు వెలుగు చూశాయి. వారి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘శుభలేఖ’ 1982లో జనం ముందు నిలచింది. 1987లో రెండో చిత్రంగా ‘స్వయంకృషి’ ప్రేక్షకులను అలరించింది. 1992 అక్టోబర్ 9న మూడో సినిమాగా ‘ఆపద్బాంధవుడు’ విడుదలయింది. ఈ మూడు చిత్రాలు చిరంజీవిలోని నటుడికి ప్రేక్షకులు పట్టాభిషేకం చేసేలా చేశాయనే చెప్పాలి. ఈ మూడు చిత్రాల్లోనూ చిరంజీవి నటునిగా ఒక్కో మెట్టూ ఎక్కారు. చిరంజీవి నటనకు అవార్డులూ, రివార్డులూ లభించడానికీ ఈ సినిమాలు దోహదపడ్డాయి.
‘ఆపద్బాంధవుడు’ కథ ఏమిటంటే- కళలంటే ప్రాణం పెట్టే పంతులుకు, ఆయన కూతురు హేమకు గోవుల కాపరి మాధవ అంటే ఎంతో అభిమానం. అతను వారికి నమ్మినబంటు. మాధవ నాటకాలు వేస్తూ అలరిస్తూ ఉంటాడు. హేమతండ్రి మంచి కవి. ఆయన పలు రచనలు చేస్తూంటారు. ఎవరైనా ప్రచురణ కర్త లభిస్తే వాటిని అచ్చు వేయించాలని భావిస్తాడు. మాధవ, హేమ కలసి నృత్యరూపకం వేస్తారు. అందులో అతను శివుడుగా, ఆమె పార్వతిగా అభినయిస్తారు. అతనిపై ఆమెకు అప్పుడే అనురాగం కలుగుతుంది. పంతులుగారి పెద్దమ్మాయి గీతకు వివాహం నిశ్చయమవుతుంది. ఆమె పెళ్ళి కోసం పంతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన మాధవ తన గోవులను అమ్మేసి ఆ డబ్బును వేరే వారి ద్వారా పంతులుకు అప్పుగా చేరేలా చేస్తాడు. ఈ విషయం తెలిసిన పంతులు తన రచనలను మాధవకు ఇస్తాడు. వాటిని ముద్ర వేయించడానికి మాధవ పట్నం వెళతాడు. అతను తిరిగి వచ్చే సరికి హేమ పిచ్చాసుపత్రిలో చేరి ఉంటుంది. హేమ అక్క భర్త, ఆమెను మానభంగం చేయబోతాడు. అడ్డు వచ్చిన భార్యను చంపేస్తాడు. అది చూసిన హేమ షాక్ గురై ఉంటుంది. దాంతో ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తూ ఉంటారు.
మాధవ ఆమెను మళ్ళీ మామూలు మనిషిగా మార్చడానికి పలు ప్రయత్నాలు చేస్తాడు. గతం గుర్తుకు తెచ్చేందుకు చివరకు అతనే పిచ్చాసుపత్రిలో చేరతాడు. ఆమె మామూలు మనిషి అవుతుంది. మాధవ తన కోసం ఎంత శ్రమించాడో తెలుసుకున్న హేమ, అతడిని పెళ్ళాడాలని భావిస్తుంది. అయితే అందుకు మాధవ అంగీకరించడు. తాను ఆమెకు తగనని, తాను వేరే వర్ణం వాడినని మాధవ భావిస్తాడు. హేమ బావతో ఆమె పెళ్ళి చేయించాలని చూస్తాడు. కానీ, అతను ఆమె మనసులో మాధవనే ఉన్నాడని తెలుసుకొని, మాధవకు నచ్చచెప్పి పెళ్ళికి అంగీకరించేలా చేస్తాడు. చివరకు మాధవ కూడా అంగీకరించాల్సి వస్తుంది. మాధవ, హేమ కలసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల, శరత్ బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, నిర్మలమ్మ, కైకాల సత్యనారాయణ, శిల్ప, కల్పనారాయ్, సుత్తివేలు, విజయ్ చందర్, ప్రసాద్ బాబు, ముక్కురాజు తదితరులు నటించారు. నటునిగా తెరపై జంధ్యాల కనిపించిన చిత్రమిదే. ఈ చిత్రానికి కీరవాణి స్వరకల్పన చేయగా, సినారె, సిరివెన్నెల, భువనచంద్ర పాటలు పలికించారు. “పరమేశ్వరుని…”, “ఒడియప్పా…”, “ఔరా అమ్మక చెల్లా…”, “చుక్కల్లారా…”, “పువ్వు నవ్వే గువ్వా నవ్వే…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఈ సినిమా అభిరుచిగల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఐదు నంది అవార్డులు లభించాయి. ఉత్తమ తృతీయ చిత్రంగా ‘ఆపద్బాంధవుడు’ నిలచింది. చిరంజీవి ఉత్తమ నటునిగానూ, ఉత్తమ మాటల రచయితగా జంధ్యాల, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా చలం, అరుణ్ డి.గొడ్కావంకర్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా భూషణ్ లఖాండ్రి నందులు అందుకున్నారు.
‘ఆపద్బాంధవుడు’కు ముందు కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనే చిరంజీవితో ‘స్వయంకృషి’ వంటి చిత్రాన్ని నిర్మించిన పూర్ణోదయా సంస్థాధినేత ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమాతో మరోమారు తన అభిరుచిని చాటుకున్నారు. చిరంజీవి వంటి మెగాస్టార్ కాల్ షీట్స్ ఇచ్చినా, పక్కా మాస్ మూవీస్ తీయకుండా తన అభిరుచికి తగ్గ సినిమాలనే ఆయన నిర్మించడం విశేషం! చిరంజీవితో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన రెండు చిత్రాలూ ఆయనకు ఉత్తమ నటునిగా నంది అవార్డులు సంపాదించి పెట్టడం గమనార్హం.
(అక్టోబర్ 9న ‘ఆపద్బాంధవుడు’కు 30 ఏళ్ళు)