తెలంగాణలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లీడ్ లో ఉండగా.. అధికారం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ ఎన్నికల్లో మొదటి సారి గెలిచారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినవాళ్లు, ఈసారి మాత్రం పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు ఆశీర్వదించారు. ఈసారి వీరు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనే అవకాశం దక్కింది. అయితే వారిలో అతి చిన్న వయస్సు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. 23,582 ఓట్లతో గెలుపొందారు. అయితే స్పీకర్ గా ఉండి విజయం సాధించడం చాలా అరుదు.. కానీ పోచారం దాన్ని తిరగరాశాడు. ఈ క్రమంలో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తాం, గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో మళ్ళీ గెలిపించారు.. నా విజయం కాదు ప్రజల విజయం, కార్యకర్తల విజయం అన్నారు.
కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ కొనసాగుతున్నారు.
మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు. 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సీఎల్పీ నేత మరోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 35,190 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 20 స్థానాల్లో గెలువగా, 45 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఒకవైపు.. ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి చెందారు.. కానీ, మంత్రి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఎర్రబెల్లిని యశస్విని ఓడించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తన గెలుపుపై యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ఎంతటి బిగ్ షాట్ లు అయినా ప్రజలు తిరస్కరిస్తే ఇంటికి వెళ్లాల్సిందేనని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హస్తం హవా కొనసాగుతుంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఈ క్రమంలో బీజేపీ తొలి విజయం సాధించింది. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ 8 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పలు నియోజకవర్గాల్లో గెలుపొందింది. భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ చివరి రౌండ్ లో పుంజుకొని కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య పై విజయం సాధించారు. ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి 4280 ఓట్ల మెజార్టీ లభించింది. ఇదిలా ఉంటే.. అంబర్ పేటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై సుమారు 3వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.