తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం బోణి కొట్టింది. చార్మినార్ నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై అలీ గెలుపొందారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మరో విజయం సాధించింది. రామగుండంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై.. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపొందారు. 35వేలకు పైగా మెజార్టీతో కోరుకంటి చందర్ పై ఘన విజయం సాధించారు.
కాంగ్రెస్ గెలుపు ధీమాపై సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముందు నుండి చెప్తున్నా.. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వీహెచ్ అన్నారు. ఇది ప్రజల విజయం.. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలు చూసి కాంగ్రెస్ కు ఓటేసారన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని.. అది కూడా బాగా కలిసొచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని వీహెచ్ పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వచ్చింది. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు 18వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులకు ఎదురుదెబ్బ తగిలింది. అందులో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ క్రమంలో మాజీ టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ లో, పద్మావతి కోదాడలో ముందంజలో ఉన్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్‌కు 3749 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. కొడంగల్, కామారెడ్డిలో మూడో రౌండ్‌లో రేవంత్‌రెడ్డికి లీడ్ లో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో 4159 ఓట్లు, కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. రెండో రౌడ్‌లో గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం ఉంది. మధిరలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.