విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో అనేక దుష్ప్రచారాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు.
పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్‌కు ముందే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. రెంటాల, పాకాలపాడు, దూళిపాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట, గురజాల గ్రామాల్లో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తన ఓటును వేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.
ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.