AP Elections 2024: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అలాగే, చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది.
Read Also: Jharkhand : ఎన్నికల ముందు జార్ఖండ్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మృతి
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న ఇంట్రెస్ట్ మరచిపోలేనిది.. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి.. మన భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. మీ ఓటు భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుందన్నారు. సుపరిపాలనకు మీ ఓటుతో నాంది పలకాలి అని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు ఏపీకి వస్తున్నారు.. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.