TTD Big Alert: తిరుమల కొండకు వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గుంపులు గుంపులుగా వదిలి పెడుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది చూస్తున్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించమని తేల్చి చెప్పారు. రాత్రి 9 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: UP: పెళ్లికి వెళ్లే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ.. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య
అయితే, తిరుమల నడక మార్గంలో చిరుత సంచారంతో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. తిరుమలలో చిరుతల సంచారం నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా చర్యల్లో భాగంగా నడక మార్గంలో ఈ ఆంక్షలు పెట్టారు. ఆ మార్గంలో విజిలెన్స్ అధికారులు గస్తీని మరింత ముమ్మరం చేశారు. కాగా, గురువారం నాడు రాత్రి అలిపిరి నడక మార్గంలోని 7వ మలుపు సమీపంలోని ముగ్గుబావి దగ్గర చిరుత కదలికలను భక్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత తిరుగుతుండటంతో భక్తులు భయపడుతుండటంతో.. టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.