Dharmana Prasad Rao: విశాఖ రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్కరణలు చేసే వాళ్లపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని అందుకే ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధర్మాన తెలిపారు. సంస్కరణలకు ముందే ఫలితాలు రావని.. అందుకే ప్రజల ఆమోదం ఉండదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటే దానికి కారణం సంస్కరణలను అర్ధం చేసుకోలేకపోవడమే అని ధర్మాన అభిప్రాయపడ్డారు.
సంస్కరణలను చేయని వారిని నిందించాల్సింది పోయి సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనేక పెద్ద ప్రాజెక్టులను తెచ్చామని.. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, మూల పేటలో పోర్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేస్తామన్నారు. 75 ఏళ్ల రాష్ట్ర సంపద, సంస్థలను హైదరాబాద్‌లో పెట్టామని.. అందుకే వారికి ఆశ కలిగిందన్నారు. అమరావతికి డబ్బులు పెట్టాక వారు పోమ్మంటే ఉత్తరాంధ్ర ఏం చేయాలని ధర్మాన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమం కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఇదే విషయం పార్టీకి చెప్పానని తెలిపారు.
Read Also: Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే ఏమిటి? గ్రహణం సమయంలో ఆహార పదార్ధాలపై దర్భను ఎందుకు పెట్టాలి?
రాష్ట్రానికి విశాఖ సెంట్రల్ పాయింట్‌లో లేదని జడ్జిలు మాట్లాడుతున్నారని.. చెన్నై, ముంబై, కోల్‌కతా వంటి రాజధానులు ఆయా రాష్ట్రాల సెంట్రల్‌లో ఉన్నాయా అని మంత్రి ధర్మాన నిలదీశారు. క్యాపిటల్ వస్తే ఇన్వెస్ట్‌మెంట్ వస్తుందని.. పలువురికి ఉపాధి లభిస్తుందని ధర్మాన అన్నారు. కేవలం విశాఖకు మాత్రమే రాజధానిగా అన్ని విధాలుగా అర్హత ఉందన్నారు. అందరినీ ఆదరించే గుణం, సంస్కారం విశాఖ వాసులకు ఉందన్నారు. మూడు రాజధానులు అంటూ పలువురు హేళన చేస్తున్నారని.. విశాఖ మెయిన్ రాజధానిగా ఉంటుందని.. హైకోర్టు పనులు కోసం కర్నూలుకు, అసెంబ్లీ సమావేశాల సమయంలో అమరావతికి ప్రజలు వెళ్తారని పేర్కొన్నారు.