టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ పరాజయం చవిచూసింది.
Read Also: బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు
అనంతరం ఇంగ్లండ్ గడ్డపైనే జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా మెరుగ్గా ఆడింది. నాలుగు టెస్టులు జరగ్గా రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఒక టెస్టులో పరాజయం పాలవగా… మరొక టెస్టును డ్రాగా ముగించింది. కరోనా కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టు 2022లో జరిగే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్‌లో న్యూజిలాండ్ జట్టు టీమిండియా పర్యటనకు వచ్చి రెండు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగియగా… రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. తాజాగా డిసెంబర్ నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా సెంచూరియన్ టెస్టులో ఘనవిజయం సాధించింది. అలా టెస్టుల్లో ఈ ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించి విజయంతోనే ముగించింది.