పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ముఖ్యంగా కొత్తనవరసపురం నుంచి విశాఖ జిల్లా యలమంచిలి మండలం మేడపాడు వరకు సుమారు 15 కిలోమీటర్ల రహదారి గోతులమయంగా తయారైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నర్సాపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రహదారి దుస్థితిపై గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఫలితం దక్కలేదు.
Read Also: ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం! ఎందుకంటే…
అయితే ఇటీవల నవరసపురం గ్రామానికి చెందిన చిందాడి నిరీక్షణరావు కుమారుడి వివాహం జరిగింది. తన కుమారుడి పెళ్లి వేడుకకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని భావించిన నిరీక్షణరావు రూ.2 లక్షల నగదు వెచ్చించి గ్రామ పరిధిలోని రోడ్డుపై పడిన గోతులను పూడ్పించి మరమ్మతులు చేయించాడు. రెండేళ్లుగా గోతులతో తీవ్ర అధ్వాన్నంగా మారిన రోడ్డుకు తన కుమారుడి పెళ్లి కోసం సొంత డబ్బులు వెచ్చించి బాగుచేయించిన తండ్రి నిరీక్షణరావును స్థానికులు అభినందిస్తున్నారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రహదారులు, భవనాల శాఖ డీఈ హరిప్రసాద్ ఈ రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నుంచి రూ.40 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.