బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయా పార్టీలన్నీ కూడా గెలుపు కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ తరుఫున ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలోని పెద్దలను రంగంలోకి దింపి ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ సైతం తనశక్తి మేరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వైసీపీ ప్రచారంలో దూసుకెళుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి బద్వేల్ ఉప ఎన్నిక బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. తన మద్దతుదారులను బద్వేల్లోని మండలాలకు ఇన్ ఛార్జిలుగా నియమించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ గెలుపు లాంఛనంగా కన్పిస్తుండటంతో మెజార్టీపై ఆపార్టీ నేతలు కన్నేశారు.
ఈ ఉప ఎన్నికలో భారీ మోజార్టీ సాధించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఉప ఎన్నికలో ప్రచారం చేస్తారనే టాక్ విన్పించింది. అయితే కరోనా కారణంగా సీఎం తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. కాగా తిరుపతి ఉప ఎన్నిక మాదిరిగానే బద్వేల్ ఉప ఎన్నికలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని వినూత్నంగా చేపట్టారు. తిరుపతి లోక్ సభ స్థానం కోసం జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని గెలించాలని కోరుతూ సీఎం జగన్ ఆ ప్రాంత ఓటర్లందరికీ లేఖలు రాసి అందరినీ ఆకట్టుకున్నారు.
సీఎం నుంచి ఓటర్లకు లేఖలు అందడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బారు. ఆ లేఖ ప్రభావంతో సీఎం జగన్ తిరుపతిలో ప్రచారం చేయకపోయినా వైసీపీ ఎంపీ అభ్యర్థి మూడు లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఇదే సీన్ ప్రస్తుతం బద్వేల్ లోనూ రిపీట్ అవుతోంది. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని, సీఎం హోదాలో తాను సభ నిర్వహిస్తే లక్షలాది మంచి ఒక్కచోట చేరే అవకాశం ఉందని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా తాను బద్వేల్ లో ప్రచారం చేయలేకపోతున్నానని.. దయచేని ఓటర్లంతా వైసీపీ అభ్యర్థి దాసరి పద్మను గెలిపించాలని సీఎం జగన్ లేఖలు రాశారు.
ఈ లేఖలను వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ పంచిపెడుతున్నారు. ఈ లేఖ ప్రభావం ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. సీఎం వినూత్న ప్రచారానికి ఓటర్లు సైతం తిరుపతి మాదిరిగానే బద్వేల్ లోనూ వైసీపీకి భారీ మెజార్టీ కట్టబెడుతారనే టాక్ విన్పిస్తోంది. ఇక కడప జిల్లాతో సీఎం జగన్మోహన్ రెడ్డికి వీడదీయరాని అనుబంధం ఉంది. దీంతో ఇక్కడ ప్రచారానికి సీఎం రాకపోయినా ఈ ప్రాంతవాసులంతా వైసీపీకి భారీ మోజార్టీ కట్టబెట్టే అవకాశాలలున్నాయి. దీంతో వైసీపీకి ఎంత మెజార్టీ వస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.