తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ ను రాబోయే 3 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశు సంవ ర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాల పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడు తూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విజయ డెయిరీ ని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి బాట పట్టించారని తెలిపారు.
అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి చేస్తున్న విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్ళే విధంగా ఉన్నతస్థాయి మార్కెటింగ్, విస్తృత ప్రచారం పాలసీని రూపొందిం చాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఔట్ లెట్‌లకు అదనంగా మరిన్ని నూతన ఔట్ లెట్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా పాలు, పెరుగు, లస్సి, దూద్ పేడ, బాదం పాలు, నెయ్యి తో పాటు టెట్రా ప్యాక్, మలాయ్ లడ్డు, రాగి లడ్డు, మిల్లెట్ లడ్డు వంటి సుమారు 33 రకాల ఉత్పత్తులను ఔట్ లెట్‌ల ద్వారా విక్రయిస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.
సహకార రంగంలో పనిచేస్తూ లాభాపేక్ష లేకుండా కేవలం పాడిరంగం పై ఆధారపడి ఉన్న రైతుల అభివృద్ధికి కృషి చేస్తూ తద్వారా ప్రజలకు నాణ్యమైన పాలను అందిస్తు ప్రజల అసరాలను విజయ డెయిరీ తీరుస్తుందన్నారు. నూతన మార్కెటింగ్ విధానాలను అవలంభిస్తూ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ టర్నోవర్ 800 కోట్ల రూపాయలుగా ఉందని, దానిని 1500 కోట్ల రూపాయలకు చేరుకొనే విధంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించుకొని, నిర్దేశించిన లక్ష్యాలను చేరే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.
విజయ డెయిరీ ఔట్ లెట్ నిర్వహకులను మరింత ప్రోత్సహించే విధంగా అత్యధిక విక్రయాలు జరిపిన వారికి ప్రోత్సాహాకాలు అందించే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీతో కుదిరిన ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ఇందల్వాయి, పంతంగి, కొర్లపహాడ్, పిప్పల పహాడ్, గూడూరు, గంజాల్ టోల్ గేట్ ల వద్ద విజయ తెలంగాణ పార్లర్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బిగ్ బాస్కెట్, ప్లిప్ కార్ట్, సూపర్ డెయిరీ వంటి సంస్థల ద్వారా కూడా విజయ తెలంగాణ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ డెయిరీ లకు దీటుగా నెయ్యిని పెట్ జార్ లలో విక్రయిస్తున్నామని, సుగంధ పాలను కూడా పెట్ బాటిల్స్ లలో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. విజయ ఉత్పత్తుల ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలను రూపొందించి వచ్చే నెల 16 వ తేదీన నిర్వహించే బోర్డ్ సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, నేషనల్ హైవే రహదారుల వెంట విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.