తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ సాయికిరణ్ రెడ్డి పంజాబ్‌లో విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారంరోజులుగా సాయికిరణ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విధుల కోసం వెళ్లిన సాయికిరణ్ అసలు పంజాబ్ చేరుకున్నాడో లేదో అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అతడికి ఏం జరిగిందోనని భయాందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాయికిరణ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read Also: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు
కాగా 20 రోజుల సెలవులు ఇవ్వడంతో నవంబర్ 16న స్వగ్రామానికి వచ్చిన సాయికిరణ్ రెడ్డి.. సెలవులు ముగిసిన వెంటనే డిసెంబర్ 5న మధ్యాహ్నం తన గ్రామం నుంచి పంజాబ్ బయలుదేరాడు. అదేరోజు రాత్రి 8 గంటలకు తాను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్నానని తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. అదే సాయికిరణ్ మాట్లాడిన చివరి కాల్ అని.. అప్పటి నుంచి ఇప్పటివరకు అతడి ఫోన్ స్విచ్ఛాఫ్‌లోనే ఉందని కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా సాయికిరణ్ పంజాబ్‌లోని ఫరీద్ కోట్‌లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.