మీడియా చిట్‌చాట్‌లో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మాతో టచ్‌లో ఉన్నాడనే అర్థం వచ్చేలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు రచ్చగా మారాయి.. అసలు తాను ఎప్పుడూ బీజేపీ నేతలతో చర్చించలేదు.. వారితో ఎప్పుడూ టచ్‌లో లేనంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.. కొన్ని అభివృద్ధి పనులు విషయంలో.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో కలిసిన మాట వాస్తమే.. కానీ, బీజేపీలో టచ్‌లోకి వెళ్లడానికి వాటికి సంబంధం లేదని తేల్చేశారు.. అయితే, బండి సంజయ్ వ్యాఖ్యలతో పాటు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారా? అనే చర్చ కూడా సాగింది.. అయితే, బీజేపీతో కోమటిరెడ్డి టచ్ వ్యవహారంపై ఇవాళ వివరణ ఇచ్చారు బండి సంజయ్.. పాదయాత్రలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాతో టచ్ లో ఉన్నారని నేను అనలేదన్నారు.
Read Also: Vice President Election: విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
అయితే, ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని.. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రధాని మోడీని కలుస్తూ ఉంటారని తెలిపారు.. ఇక, మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీయేనని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించిన ఆయన.. మళ్లీ వాళ్లే ఉప ఎన్నిక ఎవరు కోరుకున్నారని ప్రశ్నించడం చూస్తుంటే… దెయ్యాలు వేదాలు వళ్లించినట్టుగా ఉందన్నారు.. చికోటి ప్రవీణ్(క్యాసినో) వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయన్నారు.. ఇక, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో 6 నెలల చొప్పున కేసీఆర్ టైం పాస్ చేశారని విమర్శించిన బండి సంజయ్.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పేరుతో మళ్లీ 6 నెలలు టైం పాస్ చేస్తారని పేర్కొన్నారు. మరోవైపు.. కేసీఆర్ కుటుంబంపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.. మమ్మల్ని ఎవరు కాపాడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్.