Bhatti Vikramarka: పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన యువ వికాసం సభలో గ్రూప్-4 ఉద్యోగాలకు సెలక్ట్ అయిన 8084 మందికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసిందన్నారు. పెద్దపల్లిలో రూ.1500 కోట్ల అభివృద్ధి చేశాం.. ఒక్క ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరికొన్ని నియామకాలు ఇప్పటికి కొనసాగుతున్నాయన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Read Also: CM Revanth Reddy: పదేళ్లలో ఏం చేయకపోగా.. 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు..
కాగా, తెలంగాణలోని ప్రతీ మంత్రి రోజుకు 18 గంటల పాటు పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రచారం చేసినట్లైతే.. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పనులు కనిపించేవని అన్నారు. పని చేయడమే ప్రాముఖ్యతగా తాము ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు (ప్రజలు) ఒక్కసారి ఆలోచన చేయండి.. ఒక్క ఏడాది కాలంలోనే 21వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మాత్రమే అని వెల్లడించారు. భారత దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేదన్నారు. ఇక, రూ. 64 వేల కోట్ల అప్పులకు వడ్డీలను ఇప్పటి వరకు కట్టామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్, పంటకు రూ.500 బోనస్, యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.