రైతుబంధు పెంచుతారాని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవ్వకుండా ముంచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ మెదక్ ఎంపీగా గెలుస్తాడట అంటూ ఆయన సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కవిత, కేజ్రీవాల్ లాంటి ప్రతి పక్షా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, బీజేపీ వాళ్లు దేవుని పేరుతో వస్తున్నారన్నారు. కేసీఆర్ చేసినన్ని యాగాలు, పూజలు దేశంలో ఎవరు చేయలేదన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో అభివృద్ధిని సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. సీఎం వెటర్నరీ కాలేజీని కొండంగల్ కి తరలించారన్నారు. శిల్పారామం, డబుల్ రోడ్డు పనులను మధ్యలోనే అడ్డుకొని నిధులను కొడంగల్ కు తరలిస్తున్నారని చెప్పారు. కొడంగల్ కు ఏమైనా తీసుకుపో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న హరీష్ .. సిద్దిపేటకు వచ్చినవి తీసుకపోతే మాత్రం చూస్తూ ఉరుకొమన్నారు. రేపు సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగ,కక్ష్య ఎందుకని హరీష్ ప్రశ్నించారు.
ఇవాళ మన పార్టీ నుంచి కొంతమంది నాయకులు బయటకు పోతున్నారు.. కార్యకర్తలు ఎవరూ వెళ్లడం లేదు. ఎవరైతే మధ్యలో మన పార్టీలోకి వచ్చారో.. పవర్ బ్రోకర్లు, అవకాశవాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఎవడైతే పార్టీ నుంచి పోయారో.. రేపు కాళ్లు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేదని పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో వారిని పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేదు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టే. ఇది అన్యాయం కాదా..? ఏం తక్కువ చేసింది పార్టీ వారికి.. అన్ని అవకాశాలు ఇచ్చింది. పార్టీకి అండగా నిలబడ్డ నాయకులను, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.