దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వందకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తం అయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 155 మంది మహమ్మారి బారిన పడ్డారు. 24 గంటల్లో 16,319 కరోనా పరీక్షలు చేశారు. 24 మంది కోలుకోగా.. 907 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాలతో పోలిస్తే రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో 81 హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 11, సంగారెడ్డిలో 8 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల వివరాలను పరిశీలిస్తే.. కరోనా ప్రారంభం అయిప్పటి నుంచి 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,166 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం పెరిగాయి. గత వారంలో తెలంగాణలో 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 556 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో వారం వ్యవధిలో 811 కరోనా పాజిటివ్ కేేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.