V Hanumantharao: తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంత రావు సవాల్ విసిరారు. దళితబంధు పథకంలో అవినీతి జరుగుతోందన్నారు.
దళిత బంధు పథకంలో కమీషన్ తీసుకోవడం లేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వీహెచ్ ప్రకటించారు. మంగళవారం వీహెచ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో లంచం ఇచ్చిన వారికే లబ్ది చేకూరుతుందని ఆరోపించారు.
Read also: Tej Pratap Yadav: మేము వంతెనలు నిర్మిస్తున్నాం.. బీజేపీ వాటిని కూలుస్తోంది..
రాష్ట్రంలో ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూనే.. మరో వైపు రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహారిస్తోందని వీహెచ్ ఆరోపించారు. తమది రైతుల పక్షపాత ప్రభుత్వం అని పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. కిసాన్ సర్కార్ అంటూ ఊదరగొడుతున్నారని విమర్శించారు. వాస్తవంలో తెలంగాణలోనే రైతుల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఆకర్షణీయ పథకాలను పెట్టి అవినీతికి పాల్పడుతుందని వీహెచ్ విమర్శించారు. రూ. 2 లక్షలు తీసుకుని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదా? అని.. అలాగే రూ. 2 లక్షల కమీషన్ తీసుకుని దళిబంధు ఇవ్వలేదా? అంటూ ప్రశ్నలు సంధించారు.
Read also: WTC Final: రేపే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్.. ఆసీస్ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న భారత్
నూతన సచివాలయంలోకి వెళ్లడానికి సాధారణ ప్రజలకే కాదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకూ ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ తామే తెలంగాణలో అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉన్నాయన్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. త్వరలో సూర్యాపేటలో భారీ బీసీ గర్జన సభ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టూ వీహెచ్ మీడియాకు తెలిపారు.