ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు వేసింది అని చెబుతున్నారు విజయశాంతి..
ఆక్రమణకు గురవుతోన్న భూములు అమ్ముతున్నామని ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు విజయశాంతి.. అయితే, రేపటి కోకాపేట, ఖనామెట్ వేలంకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని.. 2015 హై కోర్టు ఆదేశాలతోనే రేపటి వేలానికి అనుమతి వచ్చిందని.. జిల్లాల్లో భూముల వేలానికి కోర్టు అనుమతి ఇవ్వలేదన్నారు.. పూర్తి వాదనలు విన్న తర్వాత మాత్రమే తీర్పు ఇస్తామని కోర్టు చెప్పిందని.. హై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు విజయశాంతి.. కేవలం రేపటి వేలానికి మాత్రమే అనుమతి ఉందని.. ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదన్న ఆమె.. పూర్తి తీర్పు వచ్చే దాకా భూములు ఎవరూ కొనవద్దు అని విజ్ఞప్తి చేశారు.