రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్‌ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్‌ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకట్రెండు వారాల్లో మరో రెండు సిద్ధమవుతాయని పేర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు బస్తీ దవాఖానలు, యూపీహెచ్‌సీలు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటికే టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని గుర్తు చేశారు. 12 మినీ హబ్స్‌తో ప్రజల ఆరోగ్యం, పైసలను కాపాడవచ్చని హరీశ్ రావ్ అన్నారు. వైద్యారోగ్య శాఖ గత జనవరిలో 8 మినీ హబ్స్‌ని శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పఠాన్ చెరువు, మలక్ పేట్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, నార్సింగి ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ మినీ హబ్స్ వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వైద్య అధికారులు పాల్గొన్నారు.
బారస్, జంగంపేట, అంబర్‌పేట, పురానాపూల్, పనిపురా, శ్రీరాంనగర్, సీతాఫల్‌మండి, లాలాపేటలో ఇవి సేవలు అందిస్తున్నాయని, వీటిలో ఎక్స్‌రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తున్నారని అన్నారు. 129 బస్తీ దవాఖాన / పీహెచ్‌సీ / సీహెచ్‌సీల నుంచి పరీక్షల కోసం రోగులు ఈ హబ్స్‌కు వస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి 15 నెలల్లో ఈ 8 మినీ హబ్స్‌లో 54,100 రోగులు రిజిస్టర్ కాగా, 60,281 పరీక్షలు చేశారు. వీటి ద్వారా పట్టణ పేదలకు రూ.4.26 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.
అయితే.. మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించాల్సిన గోల్కొండ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ప్రారంభం వాయిదాపడింది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిదుద్దీన్ అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం వాయివేసినట్లు అధికారులు వెల్లడించారు.