తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో టచ్ మీ నాట్‌గా కనిపించినట్టు పార్టీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట. వాస్తవానికి కాంగ్రెస్‌లో రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తర్వాతే ఎవరైనా. కానీ రాహుల్ గాంధీ టూర్ మొదటిరోజు.. ఠాగూర్ కాస్త దూరం అన్నట్టుగా ఉన్నారని టాక్. సాధారణంగా రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తే.. రిసీవ్ చేసుకునే వారిలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ముందు ఉంటారు. కానీ రాహుల్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగే సమయానికి మాణిక్యం ఠాగూర్ వరంగల్‌లో పార్టీ సభా వేదిక దగ్గరలో ఉన్నారు. ఎయిర్‌పోర్టులో పీసీసీ చీఫ్ రేవంత్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్‌లు రాహుల్‌కు స్వాగతం పలికారు.
హైదరాబాద్‌లో జరిగిన టూర్ షెడ్యూల్‌లోనూ ఇంఛార్జ్ ఠాగూర్ ఎక్కడా కీలకంగా లేనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజులు టూర్ మొత్తం పీసీసీ చీఫ్, సీఎల్పీ నేతలే కీలకంగా వ్యహరించారని గాంధీభవన్ వర్గాలు గుసగసలాడు కుంటున్నాయి. అయితే రాహుల్ గాంధీ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారో ఏమో.. ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీతో ఠాగూర్‌కు ఏదైనా విషయంలో గ్యాప్ వచ్చిందా? అని కొందరు ఆరా తీస్తున్నారట.
మాణిక్యం ఠాగూర్ తమిళనాడు పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రయత్నాల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొందరు ఠాగూర్‌కు మోకాలడ్డుతున్నట్టు తెలుస్తోంది. చాలా మంది కాంగ్రెస్ హైకమాండ్‌కు ఠాగూర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారట. పైగా తమిళనాడు రాజకీయాలు అన్నీ పీసీసీ చీఫ్ పదవి నియామకం చుట్టూ జరుగుతుండటంతో రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే తెలంగాణలో రెండు రోజులపాటు పర్యటించిన రాహుల్ గాంధీకి మాణిక్యం ఠాగూర్ కొంత దూరంగా ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కారణం ఏదైనా.. అగ్రనేత రెండు రోజుల పర్యటనలో ఠాగూర్ తీరు పార్టీలో పెద్ద చర్చే అయింది. ఈ విషయంలో ఎవరికి తెలిసిన అంశాలు వారు ప్రచారంలో పెట్టేస్తున్నారు. మరి… అసలు లోగుట్టు ఏంటో ఆ తమిళ తంబికే తెలియాలి.