తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణను సిట్ ప్రారంభించింది. ఉదయం తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కలిసి సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి సీబీఐ డైరెక్టర్‌కు నివేదికను ఇవ్వనుంది ఈ బృందం.
తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టులో సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశానన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చంద్రబాబు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని అన్నారు. ఆ రోజే వైవీ సుబ్బారెడ్డి కోర్టును కూడా ఆశ్రయించారన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారన్నారు. ప్రసాదం తినేవారిలో అనుమానాలు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారన్నారు. యానిమల్ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దేశంలో ఎక్కడా పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు.
తిరుమల వ్యవహరం జగన్‌కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు.
తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.