జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తడంతో గోదావరికి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. తీరం వద్ద 12.100 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది.
అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ3.50కోట్ల రూపాయలను చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టు కట్ట మరమ్మతులకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ ఆదేశించారు.
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు.
317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు.