పెన్షన్ల పంపిణీ పై ఘాటుగా స్పందించారు కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి.. పెన్షన్ల పంపిణీలో జరిగిన ఘోరానికి చంద్రబాబు నాయుడే కారణమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వాతాతలు గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు. చంద్రబాబు తప్పుడు పని వల్ల నేడు అవ్వ , తాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. ఎండలకు తట్టుకోలేక చాలామంది వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సంక్షేమం అనేది నిరంతరాయం.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని అడిగారు. మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీ వైఖరి కనపడుతోందని ఆరోపించారు. సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని ప్రశ్నించారు.
ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.