Kesineni Nani: శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు అంటూ ఫైర్ అయ్యారు బెజవాడ ఎంపీ, వైసీపీ అభ్యర్థి కేశినేని నాని.. విజయవాడలో క్రిస్తురాజపురం, పెద్ద బావి సెంటర్ లో తూర్పు నియోజకవర్గ జోనల్ ఎన్నికల కార్యాలయాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ లు మరియు వైసీపీ శ్రేణులతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన నాయకుడు దేవినేని అవినాష్ అని ప్రశంసలు కురిపించారు. లక్షమందికి రక్షణగా రక్షణ గోడ కట్టించిన గొప్పతనం అవినాష్ దే అన్నారు. సీఎం వైఎస్ జగన్ ని ఒప్పించి వేగవంతంగా రిటైనిoగ్ వాల్ పూర్తి చేశాడు.. నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన ఘనత కూడా ఆయన సొంతం అన్నారు.
ఇక, ఫించన్ దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేశినేని నాని.. పేదలకు, సామాన్యులకు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే.. చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారన్న ఆయన.. 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడు అంటూ సెటైర్లు వేశారు. శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు.. కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. పెన్షన్ల పంపిణీ నిలిపివేసింది చంద్రబాబేనంటూ ఆరోపణలు చేశారు కేశినేని నాని.
మరోవైపు.. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలు డివిజన్‌లకి చెందిన జోనల్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాం.. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గoలో వైసీపీ జెండా ఎగరవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీతో సీట్లు గెలవబోతున్నాం.. ఇక్కడ ప్రజలు వైసీపీని గెలిపించాటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం అన్నారు. ప్రజలు మమ్మలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని వెల్లడించారు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్.