లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. దీనికి ముందు ప్రధాని మోడీ దేశప్రజలకు లేఖ రాశారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లపై కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించి కాదు... వ్యక్తిగతమైన ఇష్యూ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కవిత అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ లు పెట్టొద్దని ఆదేశించారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు, అరెస్ట్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.. ఇన్ని రోజులు లేనిది పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్టులు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు.