Team India: టీమిండియా ఆటగాళ్లు ఇటీవల కాలంలో తరచూ గాయాల పాలవుతున్నారు. దీంతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియా ఓటమికి ఒకరకంగా గాయాలు కూడా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు వీళ్లు జట్టులో ఉండి తీరాల్సిందే. అయితే గత 35 నెలల్లో వీళ్లు ఆడిన వన్డేలు ఎన్నో తెలిస్తే మీరు షాక్ తినాల్సిందే. ఎందుకంటే 35 నెలల కాలంలో రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి ఆడింది కేవలం ఒక్క వన్డే మాత్రమే. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ త్రయం కలిసి ఆడింది. ఆ తర్వాత వీళ్లు కలిసి ఆడిన దాఖలాలు లేవు.
Read Also: Harish Rao: మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు ఆపేశారు
చివరి మూడేళ్లలో టీమిండియా రెండు టీ20 ప్రపంచకప్‌లను ఆడింది. ముఖ్యంగా రెండేళ్లుగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడింది. దీంతో వన్డే ఫార్మాట్‌కు, టీ20 ఫార్మాట్‌కు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసింది. వన్డే ఫార్మాట్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించి పలు దేశాల టూర్లకు పంపించింది. దీంతో సీనియర్ క్రికెటర్లకు వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి కల్పించింది. గాయాలు, ఫిట్‌నెస్ ఇబ్బందులతో రోహిత్ వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉండగా.. కోహ్లీ కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో వన్డేలకు దూరంగా ఉన్నాడు. అటు పనిభారం కారణంగా బుమ్రా కూడా వన్డేలకు అందుబాటులో లేడు. మరోవైపు వెన్నెముక గాయం కారణంగా గత ఏడాది బుమ్రా కేవలం ఐదు వన్డేలు, ఐదు టీ20లు మాత్రమే ఆడాడు. కాగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయానికి బుమ్రా గాయం నుంచి కోలుకుని మ్యాచ్ ప్రాక్టీస్ సాధించడం జట్టుకు ఎంతో ముఖ్యం. ఈ దిశగా బీసీసీఐ అతడిని సానబెట్టాల్సిన అవసరం ఉంది.