Rashid Khan React on Afghanistan Defeat vs India: 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని తాము భావించామని, బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు. పెద్ద జట్లపై ఇలాంటి లక్ష్యాలను ఛేదించే క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నాడు. తన బౌలింగ్ మళ్లీ గాడిన పడినందుకు సంతోషంగా ఉందని, జట్టు ఓడినందుకు మాత్రం బాధగా ఉందని రషీద్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన పోరులో 47 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓడిపోయింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.
Also Read: Rohit Sharma: వారి వలనే ఈ విజయం: రోహిత్
మ్యాచ్ అనంతరం అఫ్గానిస్థాన్ పరాజయంపై రషీద్ ఖాన్ స్పందించాడు. ‘ఈ పిచ్‌పై 170-180 పరుగులను ఛేజ్ చేయగలమని అనుకున్నాము. కానీ అది జరగలేదు. త్వరగా వికెట్స్ కోల్పోవడంతో వెనకపడిపోయాం. పెద్ద జట్లపై ఇలాంటి లక్ష్యాలను ఛేదించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా శరీరం ఇప్పుడు బాగానే ఉంది. బౌలింగ్‌లో లయను అందుకోవడం ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో కాస్త ఇబ్బంది పడ్డా. టీ20 ప్రపంచకప్ లీగ్ స్టేజ్‌లోనూ తడపడ్డా. భారత్‌పై వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. నా వ్యక్తిగత ప్రదర్శన సంతృప్తినిచ్చినా.. మ్యాచ్ ఓడినందుకు బాధగా ఉంది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆడాల్సిన అవసరం ఉంది. మేం ఎక్కడైనా మా ఆటను ఆస్వాదిస్తున్నాం’ అని రషీద్ చెప్పాడు.