ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్‌కు చెందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్ అభిమానుల నుంచే పుట్టిందని, దాన్ని వారే నడిపిస్తున్నారని చెప్పాడు. ఇండియా లీడర్షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘క్రికెట్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో నా కళ్లారా చూస్తున్నా. నాలాంటి క్రికెటర్లు క్రికెట్ ఆడేప్పుడు వందల్లో సంపాదిస్తే ఇప్పుడు ఆటగాళ్లు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. భారత్‌లో ఐపీఎల్ అభిమానుల్లోంచి పుట్టింది. దీనిని అభిమానులు, ప్రజలే నడిపిస్తున్నారు. రాబోయే కాలంలో ఇది మరింత వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఫుట్‌బాల్‌కు చెందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఐపీఎల్‌కే ఆదాయం ఎక్కువగా వస్తున్నది. నేను ఎంతగానో ఇష్టపడే ఆట ఇంత అభివృద్ది చెందుతుండటం నాకు సంతోషంగా ఉంది. కెప్టెన్సీ అనేది మైదానంలో ముందుండి నడిపించడం. జట్టును బలంగా తీర్చిదిద్దడం. ఆ క్రమంలో నేను అజారుద్దీన్, సచిన్, ద్రవిడ్‌లతో కలిసి పనిచేసినప్పుడు వారితో పోటీ పడలేదు. వాళ్లతో కలిసి బాధ్యతలను పంచుకున్నా.’ అని తెలిపాడు.
2008లో ప్రారంభమైన ఐపీఎల్.. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకుంది. తాజాగా పది ఫ్రాంచైజీలు, 74 లీగ్ మ్యాచ్‌లతో ఉన్న ఐపీఎల్.. రాబోయే రోజుల్లో మరింత విస్తృతి చెందనున్నది. రాబోయే ఐదేండ్ల కాలంలో 2025 సీజన్ నుంచి ఐపీఎల్ సీజన్ లో 84, 94 మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. అంతేగాక ఒకే ఏడాదిలో రెండు ఐపీఎల్ సీజన్లను నిర్వహించాలని కూడా డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా అది జరగక మానదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.