England Defeated New Zealand In T20 World Cup Super 12: టీ20 వరల్డ్‌కప్ సూపర్12లో భాగంగా.. న్యూజీల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో.. కివీస్‌పై సునాయాసంగా పైచేయి సాధించగలిగింది. ముఖ్యంగా.. ఇంగ్లండ్ బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేయగలిగారు. తన జట్టుని గెలిపించుకోవడం కోసం గ్లెన్ ఫిలిప్స్(36 బంతుల్లో 62) గట్టిగానే పోరాడాడు కానీ, ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40 బంతుల్లో 40) మరీ స్లో ఇన్నింగ్స్ ఆడటంతో.. బంతులు షార్టేజ్ వచ్చాయి. దీంతో లక్ష్యాన్ని చేధించలేక న్యూజీల్యాండ్ చతికిలపడింది.
తొలుత టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ గొప్ప శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కి వీళ్లు 81 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుకుంటూ వచ్చాయి. అయితే.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ సత్తా చాటలేకపోయారు. లివింగ్‌స్టన్ ఒక్కడే(20) కాస్త పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. ఓపెనర్‌గా వచ్చిన జాస్ బట్లర్ చివరిదాకా క్రీజులో ఉండి, జట్టుకి మంచి స్కోర్ జోడించాడు. కివీస్ బౌలర్ల విషయానికొస్తే.. ఫెర్గ్యూసన్ 2 వికెట్లు తీయగా.. సౌథీ, సాంట్నర్, సోధి చెరో వికెట్ తీశాడు. సాంట్నర్, సోధి మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేయగా.. మిగతా వాళ్లు భారీ పరుగులు సమర్పించుకున్నారు.
ఇక 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీల్యాండ్ జట్టుకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 3 పరుగులకే కాన్వే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే ఫిన్ అలెన్ కూడా ఔటయ్యాడు. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్, ఫిలిప్స్.. తమ జట్టుని ఆదుకోవడానికి బాగానే ప్రయత్నించారు. అయితే.. కేన్ మరీ స్లో ఇన్నింగ్స్ ఆడటం, కాసేపు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఫిలిప్స్ ఔట్ అవ్వడం, తర్వాత వచ్చిన బ్యాటర్లు సైతం చేతులు ఎత్తేయడంతో.. కివీస్ ఓటమి పాలైంది. ఒకవేళ కేన్ కూడా కాస్త మెరుపులు మెరిపించి ఉండుంటే, బహుశా కివీస్ గెలిచేదేమో! ఏదైతేనేం.. జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ కూడా సెమీస్ ఆశల్ని సజీవం చేసుకుంది.