టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రో-కోలు ప్రస్తుతం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు ఆడారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిట్‌నెస్ వారికి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో కొనసాగాలంటే.. దేశవాళీల్లో పాల్గొనాల్సిందే అని రో-కోకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.
‘సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీమిండియా తరఫున ఆడాలనుకుంటే.. ఇద్దరు తప్పకుండా దేశవాళీల్లో ఆడాల్సిందే అని స్పష్టం చేసింది. వారిద్దరూ రో-కోలు టీ20, టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. వన్డేల్లో ఆడాలంటే మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం ఇద్దరు దేశవాళీల్లో ఆడాలి’ అని బీసీసీఐ అధికారి చెప్పారు. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు (ఎంసీఏ) రోహిత్ తెలిపాడు. నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కూడా ఆడతానని ఎంసీఏకు చెప్పాడు. మరోవైపు కోహ్లీ నుంచి ఇంకా ఎలాంటి సందేశం బీసీసీఐకి అందలేదట. చివరగా 2010లో ఢిల్లీ తరఫున ఆడాడు.
Also Read: Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 3 నుండి 9 వరకు భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడుతుంది. ఈ సిరీస్ కోసం స్వ్కాడ్‌ను ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలోనే వన్డే సిరీస్‌ను ఆడనుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఇద్దరు దిగ్గజాలు చూస్తున్నారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ హాఫ్‌సెంచరీ, సెంచరీతో మెరిశాడు. రెండు డకౌట్‌ల తర్వాత కోహ్లీ అజేయంగా 87 పరుగులు చేశాడు.