Off The Record: ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకంటే షాడోనే పవర్‌ఫుల్‌గా మారిపోయారా? తనకు తెలియకుండా పిట్టపురుగు కదలడానికి వీల్లేదని శాసిస్తున్నారా? రూల్స్ ఫాలో అవుతామని చెబుతున్న అధికారులకు సైతం వార్నింగ్స్ వెళ్తున్నాయా? ఈ టార్చర్ మామూలుగా లేదని సీనియర్ ఆఫీసర్స్ సైతం తలలు పట్టుకుంటున్నది నిజమేనా? మా వాళ్ళు నచ్చిన పని చేసుకుంటారు చేసుకోనివ్వండని అంటున్న ఆ షాడో ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి?
Read Also: AP DSC 2025: డీఎస్సీ 2025 పై కీలక నిర్ణయం.. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల..
ముమ్మిడివరం టిడిపి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ప్రభుత్వ విప్‌గా అదనపు పదవి, గౌరవం. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడసలు నియోజకవర్గంలో పెత్తనం ఎవరిదన్న డౌట్ వస్తోందట స్థానికులకు. అదేంటి.. సార్ ఎమ్మెల్యే, పైగా విప్. పెత్తనం ఆయనగాక ఇంకెవరు చేస్తారన్న డౌట్ వస్తోందా? అక్కడే ఉందట అసలు ట్విస్ట్. పేరుకు దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం ఎమ్మెల్యే అయినా, రెండుసార్లు గెలిచిన హిస్టరీ ఉన్నా.. లోకల్ వ్యవహారం మొత్తం ఆయన కజిన్ బ్రదర్ పృథ్వీరాజ్ చుట్టూనే తిరుగుతోందని చెప్పుకుంటున్నారు. అటు పార్టీ పనులైనా.. ఇటు అధికారిక కార్యక్రమాలైనా.. తాను చెప్పినట్టే నడవాలని శాసిస్తున్నారట పృథ్వీరాజ్. కాదు కూడదని ఎవరైనా అంటే.. ఎమ్మెల్యేకి మించి సీరియస్ అయిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితిని బట్టి వార్నింగ్స్ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదన్నది లోకల్ టాక్. ఇదంతా చూస్తున్నవాళ్ళు మాత్రం అసలు లోకల్ ఎమ్మెల్యే ఎవరంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారట. ముమ్మిడివరం నగర పంచాయతీగా ఉంది. దాంతో పాటు మిగతా నాలుగు మండలాలకు సంబంధించి కూడా అధికారులపై పెత్తనం చేస్తున్నారట ఎమ్మెల్యే బ్రదర్. అపోజిషన్ వాళ్ళు వస్తే స్పందించాల్సిన అవసరం లేదని అధికారులకు కూడా ఆయనే ఆదేశాలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: HHVM : ఓటీటీలోకి వీరమల్లు.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎవరైనా అడ్వాన్స్ అయితే ఉతికారేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే నేను చెప్పినట్టే చేయాలని, అలా అయితేనే అందరికీ మంచిదని అధికారులకు సున్నితంగా వార్నింగ్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తాము సిస్టం ప్రకారం పని చేస్తామని ఎవరైనా ఆఫీసర్స్ చెబితే.. మరీ స్పీడ్ అయిపోకండి.. స్పీడ్ బ్రేకర్లు వేస్తే అసలుకే మోసం వస్తుందని చెప్పాల్సిన స్టైల్‌లో చెప్పేస్తున్నారట పృథ్వీరాజ్. ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, తోక జాడిస్తే ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ విషయంలో కూడా క్లారిటీగా ఉన్నానని చెప్పేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే సుబ్బరాజు వేరే వ్యవహారాల్లో బిజీ అయిపోయి నియోజకవర్గం మీద ఫోకస్ తగ్గించారని, దాంతో.. బ్రదర్ మరింత అడ్వాన్స్ అయిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీలో మొదటినుంచి ఉన్నవాళ్ళకి కూడా ఇప్పుడు కొత్తగా వ్యవహారాలు నేర్పిస్తున్నారట షాడో ఎమ్మెల్యే. నాకంతా తెలుసు కామ్‌గా నన్ను ఫాలో అయిపోండని చెబుతుండటం సీనియర్స్‌కు మింగుడు పడటం లేదట. ఎమ్మెల్యే సోదరుడి వ్యవహారంపై ముమ్మిడివరం టీడీపీ సీనియర్స్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
Read Also: actor harassing wife: రీల్ హీరో.. రియల్‌లో లైఫ్ విలన్
కొన్ని సందర్భాలలో పోలీసులు వ్యవహారాలలో కూడా పరిధికి మించి తల దూర్చేస్తున్నారట పృథ్వీరాజ్.మీ వల్ల కాకపోతే చెప్పండి ఆ ప్లేస్‌లో కొత్త వాళ్ళు వస్తారు.. చెప్పింది వినే ఖాకీలు చాలామంది ఉన్నారంటూ డైరెక్ట్‌గా పోలీస్ ఆఫీసర్స్‌కే వార్నింగ్ ఇస్తున్నారట ఆయన. ఈ వ్యవహారాలన్నీ గమనిస్తున్న వాళ్ళకు మాత్రం ఓ పేద్ద డౌట్ కొడుతోంది. నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే.. ఎమ్మెల్యేకి తెలియకుండా ఉంటుందా? అన్నీ తెలిసే ఆయన కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్ముడు టాప్‌గేర్‌లో ఓవర్ స్పీడ్ అయిపోతుంటే ఆయన ఎందుకు కంట్రోల్ చేయడం లేదని ప్రశ్నించే వాళ్ళు సైతం ఉన్నారు నియోజకవర్గంలో. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే ఇప్పుడు బాగానే ఉంటుందిగానీ.. తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయి దాట్ల సుబ్బరాజుకు. అధికారులైతే మరీ టార్చర్ పెట్టేస్తున్నట్టు ఫీలవుతున్నారట.
Read Also: Killer Wife: ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చేందుకు భార్య కుట్ర.. చివరకు
చాలామంది ఎమ్మెల్యేలు, వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి పనిచేశాంగానీ.. మీర ఇంతదారుణమైన వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని సీనియర్ ఆఫీసర్స్ అంటున్నట్టు సమాచారం. కనీసం ఉద్యోగం కూడా చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇక్కడే చూస్తున్నామని అంటున్నారట. ఈ వ్యవహారాన్ని ఇంకా…తెగేదాకా లాగితే వాళ్లకే మైనస్ అని లోకల్ టీడీపీలో కూడా టాక్ నడుస్తోంది. కొన్నిచోట్ల మా వాళ్ళ జోలికి రాకండి, వాళ్లకు నచ్చినవి వాళ్ళని చేసుకోనివ్వండని పృధ్వీరాజ్ డైరెక్ట్‌గా చెప్పేస్తుండటంతో.. అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదని అంటున్నారు. మొత్తానికి ముమ్మిడివరంలో ఎమ్మెల్యే కజిన్ బ్రదర్ డామినేషన్ ఓ రేంజ్‌లో పెరిగి తట్టుకోలేని స్థాయికి వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలు, అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారట సుబ్బరాజు సవతి సోదరుడు. ఆయన్ని ఇప్పుడే కన్విన్స్ చేసి కంట్రోల్ చేయకపోతే… అంతిమంగా నష్టపోయేది సుబ్బరాజు, ఆయన ద్వారా పార్టీ కూడా… అన్న మాటలు వినిపిస్తున్నాయి ముమ్మిడివరం టీడీపీలో.