తిరుపతి వైసీపీలో రుసరుసలు..! ఎమ్మెల్యే భూమన.. మున్సిపల్ కార్పొరేటర్ల మధ్య గ్యాప్ వచ్చిందా? పాలిటిక్స్‌లో పెత్తనాలకు కాలం చెల్లిందని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తున్నారా? ఏ విషయంలో ఎమ్మెల్యేతో వారికి చెడింది?
తిరుపతిలో భూమన వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లు!
గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతిలో ఆశించిన మెజారిటీ రాకపోయినా.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా పట్టుసాధించింది అధికారపార్టీ. 48 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలవగా.. టీడీపీకి ఒక్క డివిజనే దక్కింది. కార్పొరేషన్ పరిధిలో పూర్తి గ్రిప్ దక్కిందన్న సంతోషంలో ఉన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. కానీ.. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన కార్పొరేటర్లు.. ఇప్పుడు భుమనకు దూరంగా జరుగుతున్నారట. అదే తిరుపతి వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
కార్పొరేషన్‌లో పెత్తనం కోసం ఎత్తుగడలు!
ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య గ్యాప్ రావడంతో.. డెవలప్‌మెంట్ వర్క్స్ కంటే వారి గొడవలే ప్రముఖంగా నిలుస్తున్నాయి. కార్పొరేటర్లలో కొందరు కంట్రోల్ తప్పుతున్నారన్నది ఎమ్మెల్యే శిబిరం ఆరోపణ. కార్పొరేషన్‌లో తమ మాటే నెగ్గాలని కార్పొరేటర్లు అనుకోవడం సహజం. కానీ.. ఇది ఎమ్మెల్యే వర్గానికి నచ్చడం లేదట. దీంతో ఎమ్మెల్యే మాట వినాలో.. లేక కార్పొరేటర్లు చెప్పినదానికి ఊ కొట్టాలో అర్థంకాక నలిగిపోతున్నారట అధికారులు.
తిరుపతి శివారుల్లో భూ కబ్జాలు.. అక్రమ నిర్మాణాలు..!?
తిరుపతిలో భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే భూమన, కొందరు కార్పొరేటర్ల మధ్య చిటపటలు కామనైపోయాయి. సిటీకి ఆనుకుని ఉండే జీవకోన, ఆటోనగర్, ఎంఆర్ పల్లె, తిమ్మనాయుడు పాళెం, రాజీవ్‌నగర్, ఉపాధ్యాయనగర్‌లలో భూ కబ్జాలు.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటివెనక అధికారపార్టీ నేతలు ఉన్నారనో ఏమో.. ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడటం లేదట. చర్యలు చేపడితే రెండు వర్గాల మధ్య నలిగిపోవాల్సిందేనని ప్రచారం జరుగుతోంది.
రైల్వేస్టేషన్ వెనక అర ఎకరం స్థలంపై కన్నేశారా?
ఇక నగరంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి కొంతమంది కార్పొరేటర్లు వెళ్లి.. మాకేంటి అని నేరుగానే అడిగేస్తున్నారట. ఎవరైనా కాదూ కూడదంటే పనులు ఆపేస్తామని బెదిరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ వెనక ఉన్న అరఎకరం స్థలంపై కన్నేసిన లోకల్ లీడర్లు.. ఆ సైట్ మొత్తం తమదేని ఓనర్‌ను బెదిరించారట. బాధిత యజమాని.. వైసీపీ పెద్దల దగ్గరకు వెళ్లితే.. మీరు మీరు మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలని సూచించారట. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు నేరుగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నది బాధితుల ఆవేదన.
రోజుకో గొడవ తెరపైకి వస్తోందా?
మొత్తానికి ఎమ్మెల్యే భూమన, కొందరు కార్పొరేటర్ల మధ్య వచ్చిన రగడ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ముఖ్య చర్చగా మారిపోయింది. రోజుకో కొత్త గొడవ తెరపైకి వస్తోంది. మరి.. రానున్న రోజుల్లో ఇంకా ముదురు పాకాన పడుతుందో లేక పార్టీ పెద్దలే పరిష్కారం సూచిస్తారో చూడాలి.