Off The Record: ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉందట గ్రేటర్ గులాబీ పరిస్థితి. ఇంకా పదినెలల దాకా కార్పొరేషన్ పాలక మండలికి టైం ఉండగానే….పార్టీ పెద్దలు అప్పుడే జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారట. ఇప్పుడు ఉన్న వాళ్ళ పదవీ కాలమే ముగియలేదు. అప్పుడే ఈ ముందస్తు మాటలేంటయ్యా అంటే… అసలు మేటర్ అక్కడే ఉంది గురూ. కాస్త ఆగితే అసలు మేటర్ తెలుస్తుందని అంటున్నారట పార్టీ లీడర్స్. ఇంతకీ బీఆర్‌ఎస్ పెద్దల ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
Read Also: YS Jagan: రేపు వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం..
తెలంగాణలో మున్సిపాలిటీ పాలకమండళ్ళ పదవీకాలం ముగిసి చాలా రోజులైంది. వాటికి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు జరుగుతాయన్న క్లారిటీ లేదు. కానీ… ఇంకా పది నెలల దాకా పదవీకాలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతోంది బీఆర్‌ఎస్. కమాన్… మీరు రెడీ అవండి. మళ్ళీ మీకే టిక్కెట్లు ఇస్తామని గులాబీ పెద్దలు అనడం ఆశ్చర్యంగా ఉందని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోందట. అదే సమయంలో…అంతొద్దు బాబూ… అసలు మేటర్ వేరే ఉంది. మనోళ్ళు మామూలోళ్ళా అంటూ… అదే పార్టీలోని మరికొందరు అంటున్నారట. ఇంతకీ మేటర్ ఏంటయ్యా అంటే…. గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో తాజాగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ టైంలోనే ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారట. కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కండి. వచ్చే ఎన్నికల్లో మీరు కార్పొరేటర్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటినుంచే ఫీల్డ్‌లో ఉండండి. అలా ఉంటేనే తేలిగ్గా గెలిచే అవకాశం ఉంటుందని అన్నారు.
Read Also: JD Vance : ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ జిల్లాల్లో పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా… ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రం పూర్తిగా గెలుచుకున్నామంటూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారట కేటీఆర్. అయితే… ఆయన చెప్పడం, మేం వినడం వరకు బాగానే ఉందిగానీ… సమయం, సందర్భం లేకుండా ఇప్పుడెందుకు ఇంత ఉత్సాహ పరుస్తున్నారు? ఈ బూస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్ ఏంటని మీటింగ్‌లో పాల్గొన్న నాయకులు తమలో తాము మాట్లాడుకుంటున్న క్రమంలో అసలు విషయం బోధపడిందట. కేటీఆర్ మాటల వెనక మేటర్ చాలా ఉందని, ఆయనేమీ ఆషామాషీగా ఈ మాటలు చెప్పలేదని వాళ్లకు క్లారిటీ వచ్చిందట. ప్రస్తుతం బీఆర్ఎస్ ముందున్న ఒకే ఒక టార్గెట్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్. ప్లీనరీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తోంది గులాబీ అధినాయకత్వం. అందులో భాగంగానే… గ్రేటర్ హైదరాబాద్ నుంచి వీలైనంత ఎక్కువగా జనాన్ని తరలించాలని అనుకుంటున్నారట.
Read Also: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్
ఇక, అలా తరలించాలంటే.. ముందు నాయకుల్లో ఉత్సాహం రావాలి. ఆ ఊపు తెప్పించేందుకే కేటీఆర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చి… కార్పొరేటర్ టిక్కెట్ ఆశ చూపినట్టు అంచనా వేస్తున్నారు నాయకులు. మీరే కార్పొరేటర్ అవుతారు సిద్ధంగా ఉండండి అంటే.. ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా.. జనాన్ని పోగేస్తారన్నది పార్టీ పెద్దల అంచనాగా తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలకు ముందు అయితే… జనసమీకరణకు నాయకులు పోటీలు పడతారు. కానీ ఇప్పుడు ఏ ఎన్నికలు దరిదాపుల్లో లేవు. దీంతో ఉన్నవాళ్ళనే ఉత్సాహపరిచి జనాన్ని తరలించేందుకు సిద్ధం చేస్తోందట అధిష్టానం. అందుకే తమకు బలం ఉన్న గ్రేటర్ పరిధి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈనెల 27న జరగబోయే ప్లీనరీ బహిరంగ సభ ని విజయవంతం చేసే ప్రయత్నాల్లో ఇదొకటిగా చెప్పుకుంటున్నారు బీఆర్‌ఎస్ లీడర్స్. జీహెచ్ఎంసి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు గానీ… అలా ఆశపెడితే… గులాబీ లీడర్స్ ఎంతవరకు రీ ఛార్జ్ అవుతారో చూడాలంటున్నారు పరిశీలకులు.