వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతోందా? అందుకోసం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగిపోతోందా? కొత్తగా రాజకీయ ప్రవేశం చేయబోతున్న ఆ వారసులు ఎవరు? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? అసలు ప్లానింగ్ ఏంటి? ఆశాకిరణ్…. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తళుక్కుమంటున్న సరికొత్త కిరణం. రాజకీయాల దిశగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి అభిమానులు ఉన్నారు. రంగా విగ్రహ ఆవిష్కరణలు, జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతుంటాయి. కాపు యువత అయితే ఆయన్ని ఐకాన్‌గా భావిస్తుంటారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ ఓట్ బ్యాంక్‌ను పదిలం చేసుకోవడానికి ప్రతి ఎన్నికల సందర్భంలో రంగా నామ జపం చేస్తుంటాయి. ఇక రంగా వారసుడిగా ఆయన కుమారుడు రాధా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ… ఇప్పుడు కుమార్తె ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుండటం ఆసక్తి రేపుతోంది. ఇన్నాళ్ళు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ తప్ప… జనంలో అంత యాక్టివ్‌గా తిరగని ఆశాకిరణ్… ఇటీవల సడన్‌గా రంగా విగ్రహం దగ్గర నివాళి అర్పించి ఇక నుంచి ప్రజల్లో ఉంటానని, అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఆ ప్రకటన చుట్టూనే ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశాకిరణ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ… అది ప్రచారంగానే మిగిలిపోయింది. అందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు రాజకీయాల్లోకి వస్తే చాలా మాటలు పడాల్సి వస్తుందంటూ అన్న వంగవీటి రాధా అయిష్టత వ్యక్తం చేయడం వల్లే అప్పుడు బ్రేక్ పడిందన్నది ఆ ప్రచారం సారాంశం.
అన్న చెల్లెలు మధ్య భేదాభిప్రాయాలు లేనప్పటికీ…ఈ విషయంలో మాత్రం అంత సానుకూల అభిప్రాయాలు లేవన్నది వంగవీటి ఫ్యామిలీ సన్నిహితుల మాట. అప్పటికైతే అలా జరిగిపోయిందిగానీ… ఇక మీదట కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్నదే ఆశాకిరణ్ అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆమె చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ మిస్ అయితే అయిందిగానీ.. ఈసారి మాత్రం వదలకూడదన్న ఉద్దేశ్యంతో రంగా కుమార్తె ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీలోకి రావాలని రాధాకు ఆఫర్ ఉన్నా… ఆయన చేరలేదు. అదే సమయంలో ఆశాకిరణ్‌ను చేర్చుకుని పోటీకి దింపుతారన్న ప్రచారం జరిగింది. అప్పుడు రాధా చెబితే చెల్లెలికి టీడీపీ కూడా టికెట్ ఇచ్చేదని, ఫైనల్‌గా రెండు అవకాశాలు మిస్ అయ్యాయన్నది ఆశాకిరణ్ శిబిరం అభిప్రాయంగా తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో… వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని బలంగా ఫిక్స్ అవటంవల్లే… ఇప్పుడు ఆమె ప్రజల్లోకి వెళ్ళటానికి తొందర పడుతున్నారనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ఏ పార్టీలోకి వెళ్ళాలన్నది ఇంకా నిర్ణయించుకోకున్నా…. రాధా రంగా మిత్ర మండలి కార్యక్రమాలతో ఇక యాక్టివ్ రోల్ పోషించాలని అనుకుంటున్నారట. రాధా… ఇప్పటికి వరుసగా రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నందున వంగవీటి రంగా వారసురాలిగా తాను యాక్టివ్ అయి ఈసారి బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నట్టు చెబుతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే యాక్టివ్ అవటం ద్వారా… ముందు తానేంటో నిరూపించుకోవాలని, తర్వాత పార్టీల నుంచి పిలుపులు వాటంతట అవే వస్తాయని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందు వరుస కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉంటే….ఏ పార్టీలోకి వెళ్ళాలన్నది ఎన్నికల సమయానికి నిర్ణయం తీసుకోవచ్చని ఆశాకిరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.