Off The Record: ఏపీలో ఒకపక్క జోరుగా వర్షాలు పడుతుంటే…. మరోవైపు పొలిటికల్ హీట్ మాత్రం పొగలు పుట్టిస్తోంది. అందులోనూ… పై స్థాయిలో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు పైకి కనిపించకున్నా… లోలోపల కుళ్ళబొడిచేసుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ప్రత్యేకించి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అందులోనూ… భీమవరం డీఎస్పీ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. డీఎస్పీ జయసూర్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో సీరియస్ కామెంట్సే చేశారాయన. భీమవరం ఏరియాలో పేకాట క్లబ్ లను ప్రోత్సహిస్తున్నారంటూ…దానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వమని ఎస్పీని ఆదేశించారాయన. సరిగ్గా ఇక్కడే… అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీన్‌లోకి వచ్చారు. ఓవైపు పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేస్తుంటే… వాటితో సంబంధం లేదన్నట్టుగా.. అదే డీస్పీకి రఘురామ క్లీన్ చిట్ ఇచ్చేయడం కలకలం రేపుతోంది. ఈ అబ్బాయి చాలా మంచోడన్న సినిమా టైటిల్‌ని గుర్తు చేసుకుంటూ… డిప్యూటీ స్పీకర్… డీఎస్పీ జయసూర్యకు ఒకటికి రెండు సార్లు కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేయడం వివాదానికి కారణమైంది. అసలు దీని అజెండా ఏంటన్న చర్చలు సైతం మొదలయ్యాయి. పవన్‌కళ్యాణ్ కాదన్నదాన్ని రఘురామకృష్ణంరాజు ఔననడం ఏంటి? తెర వెనక కథలేవో ఉన్నాయన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి.
ఇంతకీ… విషయం ఏంటంటే…. భీమవరం డీఎస్పీకి రఘురామ రికమండేషన్‌తో పోస్టింగ్ వచ్చిందట. లోకల్ జనసేన ఎమ్మెల్యే వేరే పేరు చెబితే… ఆయన్ని కాదని ఇప్పుడున్న జయసూర్యకు అవకాశం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆ వివాదం అలా నడుస్తుండగానే… ఇటీవల అసెంబ్లీ ఎపిసోడ్ అగ్గికి ఆజ్యం పోసిందట. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అప్పుడు ఛైర్‌లో ఉన్న రఘురామ వారించకపోవడం లాంటివి జనసేన ముఖ్యుల్లో అసంతృప్తికి కారణం అయ్యాయట. అసలు సభలో లేని, సంబంధంలేని చిరంజీవిని పరోక్షంగా టార్గెట్ చేస్తుంటే… ఛైర్‌లో ఉన్న డిప్యూటీ స్పీకర్ వారించకపోవడం ఏంటన్నది జనసేన ప్రధాన ప్రశ్న. అప్పటి నుంచి ఆ పార్టీ హిట్ లిస్ట్‌లో రఘురామ చేరి ఉండవచ్చంటున్నారు. అలా అసంతృప్తి రగులుతున్న క్రమంలోనే… భీమవరం డీఎస్పీ ఎపిసోడ్ అంది రావడంతో… పవన్ కూడా గట్టిగానే టార్గెట్ చేసినట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. డీఎస్పీకి రఘురామ మనిషి అన్న ముద్ర ఉండటం, భీమవరం పేకాట క్లబ్‌లను మూయించే విషయంలో ఆయన ఒక్కొక్కరికి ఒక్కో రూల్ అమలు చేస్తున్నారన్న ఆరోపణలతో అలా డిసైడ్ చేసినట్టు సమాచారం. డీఎస్పీ విషయమై పవన్ ఆ స్థాయిలో రియాక్ట్ అయినా, దాని తీవ్రత తెలిసినా వెనక్కి తగ్గకుండా డిప్యూటీ స్పీకర్ కూడా ఒకటికి రెండు సార్లు ఆఫీసర్‌కు సర్టిఫికెట్ ఇవ్వడం వెనక ఆయన పర్సనల్ అజెండా కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు పరిశీలకులు.
తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఉండి ఎమ్మెల్యేకు ఉందని అంటున్నారు. అసలు టీడీపీ నా వల్లే అధికారం లోకి వచ్చిందని, నాటి వైసీపీ ప్రభుత్వం తనతో వ్యవహరించిన తీరువల్లే… నెగెటివ్ పెరిగి తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయిందన్నది ఆయన నమ్మకం అట. కూటమి అధికారంలోకి రావడానికి కారణమే నేనైతే… నాకు మంత్రి పదవి రాకపోవడమా అంటూ… రాజుగారు అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో… కాస్త గిల్లి..గిచ్చి తన ప్రాధాన్యతను తెలియజెప్పాలనుకుంటున్నారన్నది కొందరి అభిప్రాయం. కారణం ఏదైనా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా…. వోవరాల్‌గా, ఒక డీఎస్పీ విషయంలో ఇద్దరు డిప్యూటీలు బాహాటంగా మాట్లాడ్డం, అది ఎట్నుంచి ఎటో టర్న్ అవుతుండటాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.