Off The Record: కొన్ని నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా.. అది వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది. అక్కడి నాయకుల రాశి ఫలాలు అలా ఉంటాయని అంటారు కొందరు. ఇంకా కరెక్ట్‌గా మాట్లాడుకోవాలంటే… రాశి ఫలాలు అనేకంటే…. వాళ్ల మాటలు, చేతలు అనడం కెరక్ట్ అంటారు ఎక్కువ మంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇలాంటివి మాత్రం తప్పవు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా రాప్తాడు. మొన్నటి వరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికార పార్టీ నేత అడ్డసుడి వ్యవహారాలు అంటూ టీడీపీ నేతలు గట్టిగానే విమర్శించేవారు. ఇప్పుడు తోపుదుర్తి ఓడిపోయాక.. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కులం రంగు పులుముకున్నాయి. మాజీ ఎమ్మెల్యే మాకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి బీసీ సంఘాలు.
Read Also: AP Crime: బాలికను 3 రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్..
ఇంతకీ ఏం జరిగిందంటే… ఈనెల 13న రామగిరి మండలం పోలేపల్లిలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. అందులో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రకాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేని కనగానపల్లి మండలం దాదులూరు దాటిన తర్వాత ధర్మవరం డిఎస్పీ, సీఐ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా అక్కడికి వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో… వారితో వాదనకు దిగారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మామూలుగా అయితే…. మ్యాటర్ అక్కడితో ముగిసిపోవాలి. కానీ… ఆ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గతంలో ఒక వ్యక్తిని టీడీపీ వారు కొడితే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు.. ఇప్పుడు దేవుడి గుడి వద్దకు వెళ్తున్నా.. అనుమతులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? లేదంటే టిడిపి నేతల కోసం పని చేస్తున్నారా? అంటూ ఫైరైపోయారు. అంతవరకు కూడా ఓకే అనుకున్నా… దానికి కొనసాగింపుగా అన్న మాటలలు మాజీ ఎమ్మెల్యేని ఇరికించినట్టు చెప్పుకుంటున్నారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ టిడిపి ఏజెంటుగా పని చేస్తున్నారంటూ ఆరోపించారాయన. అలాగే పలు సందర్భాల్లో ఎస్ఐ సుధాకర్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ.. ఇదేమైనా మీ నాయన జాగీరా? అంటూ విరుచుకపడ్డారు. అక్కడే క్యాస్ట్ టర్న్ తీసుకుంది వ్యవహారం. రామగిరి ఎస్ఐ యాదవ్ కావడంతో… బీసీ సంఘాలు సీన్ లోకి వచ్చారు. విధి నిర్వహణలో ఉన్న బీసీ ఎస్ఐని దుర్భాషలాడి ప్రకాష్‌రెడ్డి తన కుల అహంకారం చూపించుకున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, మరోసారి ఇలాంటి మాటలు వస్తే…. సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు బీసీ నాయకులు. అలాగే అనుచిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే…. బీసీ సంఘాల ఆధ్వర్యంలో తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. డ్యూటీలో నిబద్ధతతో ఉన్న పోలీసు అధికారిని అవమానించడం ముమ్మాటికి అప్రజాస్వామికమంటూ ఫైరైపోతున్నారు బీసీ లీడర్స్. ఎన్నికల సమయంలో మా ఓట్ల కోసం తిరిగిన రోజులు మర్చిపోయారా? ఏరు దాటాక తెప్ప తగలేస్తారా అంటూ మండి పడుతున్నారట. ఇదంతా గమనిస్తున్న వాళ్ళు మాత్రం… కాలం కలిసిరాకుంటే… తాడే పామై కరుస్తుంది. ఆ సంగతి మర్చిపోయి… ఒళ్ళు తెలియకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుందని అంటున్నారట. ఇప్పుడు అధికారంలో లేమన్న సంగతి గుర్తుంచుకుని ఆ నోటి దురదకు కాస్త మందు రాసుకుంటే బెటరని కూడా సలహాలిస్తున్నారట తోపుదుర్తికి. అలా చేయకుంటే తోపుదుర్తి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటూ…. రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉంటుందని కూడా సెటైర్స్ వేస్తున్నారు కొందరు. ఈ మాజీ ఎమ్మెల్యే కంట్రోలవుతారా? రాష్ట్ర పర్యటన చేస్తారా అన్నది ఆయనే తేల్చుకోవాలని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.