బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. 1994, 1999లో నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బీజేపీ నాయకుడు. సొంత పార్టీని విమర్శించకుండానే సంగమేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐకానిక్ వంతెనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టబోతున్నారు. అక్కడ బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలనేది ఆయన డిమాండ్. ఈ ఉద్యమం వెనుక కండువా మార్చే ఎత్తుగడ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి గుడ్‌బై చెప్పి తిరిగి టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారట. ఇదే ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో చర్చగా మారింది.
Read Also: Off The Record: గవర్నర్‌పై బీఆర్‌ఎస్ నేతల వైఖరిలో మార్పు..? కామెంట్స్‌పై వివరణ ఇస్తారా?
ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉన్న బైరెడ్డి.. 2012లో చంద్రబాబుతో విభేదించి బయటకొచ్చేశారు. 2013లో రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. రాయలసీమ సమస్యలపై ఐదేళ్లపాటు బస్సు యాత్రలు, ట్రాక్టర్ యాత్రలు చేపట్టినా.. ప్రజల్లో రాయలసీమ సెంటిమెంటును రగిలించలేకపోయారు బైరెడ్డి. దీంతో RPSను చుట్టేసి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్‌లోనూ ఇమడలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి తన ఆగర్భ శత్రువు గౌరు వెంకటరెడ్డి కుటుంబంతో కలిశారు. 2019 ఎన్నికల తరువాత మళ్లీ టీడీపీ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలోనూ బైరెడ్డి ఉక్కపోతకు ఫీలవుతున్నట్టు సమాచారం. కొంతకాలంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. NH 167సి రహదారిపై కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఐకానిక్ వంతెన ప్రకటన ఆయనకు రుచించలేదు. సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. అయితే కేంద్ర ప్రతిపాదించిన ఐకానిక్ వంతెన సినిమా పాటలు తీయడానికి, సెల్ఫీలు తీసుకోవడానికే పనికి వస్తుందని బైరెడ్డి విమర్శించారు. బ్రిడ్జి కం బ్యారేజి నిర్మిస్తే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనేది బైరెడ్డి వాదన. ఇదే అంశంపై ఆందోళనకు ఆయన సిద్ధం అవుతున్నారు. వేల మందితో చలో సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని చేపడితే పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. బీజేపీలో ఉంటూ కేంద్రం మంజూరు చేసిన ఐకానిక్ బ్రిడ్జిని బైరెడ్డి వ్యతిరేకించడం దేనికి సంకేతం అనే చర్చ జరుగుతోంది.
Read Also: Off The Record: వైసీపీలో పరిణామాలతో టీడీపీలో కలవరం..! నాటి సీన్ రిపీట్ అవుతుందా..?
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కడపలో బీజేపీ రాయలసీమ సభ నిర్వహిస్తే.. ఆ కార్యక్రమానికి కన్వీనర్‌గా ఉన్నారు బైరెడ్డి. అయినప్పటికీ ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదట. వేదికపైనే పార్టీ పెద్దల సమక్షంలోనే రచ్చ చేసి బయటికి వచ్చేశారు. ఆ తరువాత బీజేపీ కార్యకలాపాలపై అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు వచ్చినా బైరెడ్డి ఉలుకు పలుకు లేదట. ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతోందని చర్చ నడుస్తోంది. బైరెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో అనేంతగా బీజేపీకి దూరమయ్యారట. దీంతో ఎక్కడికి వెళ్లినా బైరెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు నుంచి ఒత్తిడి ఉందట. ఫిబ్రవరిలో కీలక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. ఆయన టీడీపీలోకి వెళ్తారని బలంగా ప్రచారం జరుగుతోంది. మరి.. సొంత గూటికి తిరిగి చేరుకునే విషయంలో బైరెడ్డి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.