Off The Record: జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చినప్పుడు, రాజకీయ నేతలకు ఊహించిన పదవులు దక్కినప్పుడు… ఆ మాటలే వేరుగా ఉంటాయి. ఇంకేముంది… ఇరగదీసేస్తాం… దున్నేస్తాం…మనకడ్డేలేదంటూ మాటలు పేలుతుంటాయి. సరే… చేతల్లోకి వచ్చేసరికి అది ఎంతవరకన్నది వేరే సంగతి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందని అంటే…. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న వాతావరణానికి సంబంధించిన చర్చ. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ వచ్చేశారు. కానీ… ఆమె రొటీన్‌కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది నాయకుల్లాగా పెద్ద పెద్ద మాటలు చెప్పలేదుగానీ… పార్టీని గాడిన పెట్టే కార్యక్రమాన్ని సీరియస్‌గానే మొదలెట్టేశారట. మొదటి ప్రసంగంలోనే పని చేస్తేనే భవిష్యత్ అని… బ్యాగులు మోయడం కాదు.. మీ పని మీరు చేయండంటూ క్లారిటీ ఐతే ఇచ్చారు. దీంతో ఇక పదవుల పంపకాల్లో కూడా ఇంతే కఠినంగా ఉంటారా..? నిజంగా పార్టీ కోసం పని చేస్తున్న వాళ్ళకు న్యాయం జరుగుతుందా అన్న టాపిక్ నలుగుతోందట ఇప్పుడు టీజీ కాంగ్రెస్ వర్గాల్లో. ఇప్పటి వరకు జరిగిన..నియామకాలు… టికెట్ల కేటాయింపు లాంటివన్నిటినీ ఇన్నాళ్లు ఇన్చార్జిగా ఉన్న దీపా దాస్ మున్షీ పర్యవేక్షించారు.
ఆమె గ్రూపుల వారీగా ఎంపిక చేశారని, తనకు అనుకూలంగా ఉండే ఓ నాయకుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని, అలాగే మరొకర్ని ఎమ్మెల్సీని చేశారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. దీంతో మీనాక్షి నటరాజన్ కూడా ఇలాగే చేస్తారా..? లేక పని చేసిన వారికే పదవులు వస్తాయా..? అన్న టాపిక్ మీద హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. జనరల్‌గా… కాంగ్రెస్ అంటేనే గ్రూపులు ఎక్కువ. తెలంగాణలో ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు…పార్టీ పోస్టుల కోసం… నలుగురు నాయకులు…వారి టీంని, లేదంటే వాళ్లకు నమ్మకంగా ఉంటారని అనుకున్న వాళ్ళని రికమండ్ చేసేవారట. అందుకు తగ్గట్టే వాళ్ళకే పదవులు వచ్చేవి. దీంతో నాయకుల ఆశీస్సులు లేని వారు, పని చేసి జెండా మోస్తూనే ఉన్నవారికి ఎప్పటికీ లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు లేకుండా పోతున్నారన్న ఫీలింగ్ కలుగుతోందట. పార్లమెంట్ ఎన్నికలతోపాటు…ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేసిన వారికి సరిగా గుర్తింపు రావడం లేదనే ఫీలింగ్ చాలామంది నేతల్లో ఉందట. ఈ పరిస్థితుల్లో… పార్టీలో గ్రూపుల నుండి రికమండేషన్స్ లేకుండా మీనాక్షి నటరాజన్ అయినా… పదవులు భర్తీ చేస్తారా..? పని చేసే వారికి ఇకనైనా న్యాయం జరుగుతందా? నారాజ్ గా ఉన్న పార్టీ క్యాడర్‌ని ఆమె యాక్టివ్ మోడ్ లోకి ఎలా తీసుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.