ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌సింగ్.. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని సెట్ చేస్తారా? రెండుగా చీలిన కాంగ్రెస్ నాయకులను ఏకం చేయడం అంత ఈజీనా? గాంధీ ఫ్యామిలీ చెప్తేనే వినని నేతలు దిగ్విజయ్ సింగ్ చికిత్సకు దారికి వస్తారా?
వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరిస్తున్న డిగ్గీ రాజా
తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీని సెటిల్ చేయడానికి పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్‌ని రంగంలోకి దింపింది. హైదరాబాద్ వచ్చిన డిగ్గీరాజా పార్టీ నాయకులతో మాట్లాడే పనిలో పడ్డారు. సీనియర్ నాయకులని ఒక్కొక్కరిని పిలిచి వారు చెప్పేది ఆలకిస్తున్నారు. అలాగే పార్టీలో ఈ పంచాయితీలకు కారణాలపైనా ప్రశ్నలు సంధిస్తున్నారట. నాయకులు అందరితోనూ పర్సనల్‌గా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్వేచ్ఛగా అందరూ అభిప్రాయాలు చెప్పే వెసులుబాటును కల్పించారు. అయితే హీట్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను దిగ్విజయ్ సింగ్ కూల్ చేయగలరా? వలస, ఒరిజినల్ నేతలని విడిపోయిన వారిని ఏకతాటి మీదకు తీసుకురాగలరా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి.
గతంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్, ప్రియాంకాగాంధీ భేటీ
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏడాదిన్నరగా సమన్వయలేమితో సతమతం అవుతున్నారు. తాజాగా PCC కమిటీల వ్యవహారాన్ని తెరమీదకి తెచ్చి పెద్ద రచ్చ చేశారు. దీంతో అధిష్టానం దిగిరాక తప్పలేదు. కాంగ్రెస్ నేతలు తమకున్న అభ్యంతరాలను గతంలోనే హైకమాండ్‌కు విన్నవించారు. 28 మంది సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిచి ప్రియాంకాగాంధీ గంటలకు కొద్ది సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీ కూడా కలిసి పని చేద్దామని చెప్పి పంపించారు. రాహుల్‌ను కలిసి హైదరాబాద్ వచ్చిన వెంటనే కొందరు సీనియర్లు తమ అభిప్రాయాలను బాహటంగానే చెప్పేశారు. తాజాగా కమిటీలలో అవకతవకలు జరిగాయని సీనియర్లు అంతా బయటకు వచ్చారు. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న కలహాలు కాస్త ఓపెన్ అయ్యాయి. సమస్య పెద్దది కావడంతో దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది అధిష్ఠానం.
డిగ్గీరాజా అంతా సెట్ చేస్తారా?
ప్రియాంక… రాహుల్ గాంధీ చొరవ తీసుకున్నా మారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్ రాకతో సెట్ అవుతారా..? ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలను దారిలోకి తెస్తారా ? వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో నేతలు ఇప్పుడైనా కలిసి పనిచేస్తారా అనే ప్రశ్నలకు జవాబులు వెతికే పనిలో పడ్డాయి పార్టీ శ్రేణులు. దిగ్విజయ్ సింగ్ గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా పనిచేశారు. ఆయనకు తెలియని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో లేరు. పైగా నాయకులు ఎవరేంటో డిగ్గీరాజాకు తెలుసు. మరి.. దిగ్విజయ్ చాణక్యం సమస్యను సెట్ చేస్తుందో లేదో చూడాలి.