Off The Record: ఏం చేస్తారో తెలియదు…. మేయర్ పీఠం దక్కాల్సిందేనని సీఎం ఆర్డర్. కానీ…. సేనాధిపతి లేకుండా యుద్ధం చేయడం ఎలాగన్నది కేడర్ క్వశ్చన్. మింగ మెతుకు లేదుగానీ.. మీసాలకు సంపెంగ నూనె అంటూ ప్రత్యర్థుల సెటైర్స్. ఇన్ని రకాల పరిస్థితుల మధ్య అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. ఎక్కడుందా పరిస్థితి? అక్కడే ఎందుకలా?
Read Also: SI Rajasekhar case: బుద్ధి గడ్డితింది.. ఉద్యోగం ఊడిపోయింది..
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం…. 2004 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదు. వరుసగా మూడు ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. గత ఎన్నికల వరకు కరీంనగర్ అసెంబ్లీకి పెద్ద దిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ వెళ్ళడంతో… ఇక్కడ నాయకత్వ కొరత ఏర్పడింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్‌ను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక తర్వాతి నుంచి నగరంలో పార్టీకి నాయకుడంటూ లేక దిక్కులు చూస్తోంది కేడర్. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆదేశించారట సీఎం రేవంత్‌రెడ్డి. వారు ఆదేశించడం వీరు వినడం వరకు బాగానే ఉందిగానీ… గ్రౌండ్‌లోనే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదట. అసలు సేనాధిపతి లేకుండా యుద్ధంరంగంలోకి దూకమంటే ఎలాగన్నది కరీంనగర్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి ప్రశ్న. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉండటం, ఆ రేంజ్‌లో కాంగ్రెస్ నాయకత్వాన్ని తయారు చేయలేకపోవడం లాంటి రకరకాల సమస్యలు ఉన్నాయట. ఇన్నేళ్లుగా సంప్రదాయ కార్యకర్తలు తప్ప కొత్త వారు పార్టీలోకి రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మంచి ఫలితాలు వచ్చి… ముగ్గురు మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కరీంనగర్ నగరంలో పరిస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు మారింది.
Read Also: Terror Activity : ఏపీలో ఉగ్రకదలికలు.. భయం భయం..
సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా… ఇప్పటికిప్పుడు కదలిక వచ్చే అవకాశం లేదంటున్నారు. కరీంనగర్‌లో 66 డివిజన్లు ఉండగా… దాదాపు మూడున్నర లక్షల ఓట్లుఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ హస్తం పార్టీ రిక్త హస్తమే మిగిలింది. ఇప్పుడు మేయర్ పీఠం దక్కించుకోవాలంటే సున్నా నుంచి మొదలెట్టలి. క్షేత్ర స్థాయిలో భారీ కసరత్తే జరగాలి. కానీ… గ్రౌండ్ కి వెళ్లాలంటే జంకుతున్నారట ఆ పార్టీ నేతలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కరీంనగర్‌లో ఇంకా ప్రారంభం కాలేదు. ఓవైపు ప్రభుత్వ పథకాలు అందక పోవడం మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు ఉండటం..ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కారణంగా హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పైగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉంది. దీని మీద ముగ్గురు నాయకులు కన్నేయడంతో గందరగోళం ఇంతా పెరుగుతోందంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు, ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముగ్గురూ మూడు గ్రూపులు నడుపుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మేయర్ పీఠం దక్కించుకోవాలని పైనుంచి వచ్చిన ఆదేశాలు ఎలా అమలు అవుతాయన్నది కేడర్ క్వశ్చన్.
Read Also: Anakapally : అనకాపల్లిలో వరుస హత్యలు.. అసలేం జరుగుతోంది..
నియోజకవర్గ పరిధిలో 90 శాతం ఓట్లు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ బలం పెంచుకోకుండా అసెంబ్లీ ఇంచార్జ్ కష్టం అనే భావనకు వచ్చారట ముగ్గురు నేతలు. వాళ్ళు ఆ పనిని సీరియస్‌గా చేస్తుంటే వర్గపోరు తీవ్రం అవుతోందన్నది లోకల్ కాంగ్రెస్ వాయిస్. అన్నీ కలిసి వస్తే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అవ్వాలని ప్లాన్స్ వేస్తున్నారట వెలిచాల. ప్రతీ పదిహేను రోజులకు ఓసారి రిపోర్ట్ పంపమని సీఎం అడిగారు, కాబట్టి నేనే లీడర్ అన్నది ఆయన వెర్షన్. మరోనేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సైతం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మీద కాన్సంట్రేట్ చేసి నగరంలో బేస్ రెడీ చేసుకుంటున్నారట… కార్పొరేషన్ ఎన్నికల్లో తన మనుషులకు టికెట్లు వస్తాయని కూడా హామీ ఇస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు కాకుండా గత 15 ఏళ్ల నుంచి పార్టీని వీడకుండా లాయల్ గా పనిచేసిన నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.
Read Also:Tollywood : సమస్య పరిష్కారం కోసం రంగంలోకి చిరంజీవి
పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ ఆదారిటీ ఛైర్మన్ పదవి దక్కింది. 8 ఏళ్ల నుంచి నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం తనకు కలిసివస్తుందన్నది ఆయన లెక్క.పాత కాంగ్రెస్ కార్యకర్తలు తనవెంట ఉండటం… అన్నిటికీ మించి మంత్రి శ్రీధర్ బాబు సపోర్ట్ అసెట్ అవుతుందని భావిస్తున్నారట. అసలు ఏమీ లేని చోట కలిసి పని చేయకుండా… ఇలా ముగ్గురూ ఎవరికి వారు రాజకీయం చేయడంతో… కేడర్‌లో కూడా గందరగోళం పెరుగుతోందని అంటున్నారు. ముగ్గురి మధ్య సమన్వయం లేకుండా గెలుపు ఎలా సాధ్యమన్నది కార్కర్తల క్వశ్చన్. బలంగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్‌ను ఢీకొట్టి కరీంనగర్ కార్పొరేషన్‌లో 35 సీట్లు సాధించే సత్తా ఉన్న లీడర్ ఎవన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్.