Anakapally : అనకాపల్లి జిల్లాలో మళ్లీ వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 4 రోజుల వ్యవధిలో 2 మృతదేహాలు సంచలనంగా మారాయి. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? నగర శివారు ప్రాంతాలే ఎందుకు ఎంచుకున్నారు? కలకలం రేపిన ఆడ, మగ ఈ రెండు మృతదేహాలకు ఏమైనా సంబంధం ఉందా? రెండు మృత దేహాలు.. వంద అనుమానాలు.. మిస్టరీ మరణాలు వెనక ఎవరి హస్తం ఉంది.
అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. 4 రోజుల క్రితం గర్భిణీ హత్య ఘటన మిస్టరీగా ఉండగానే మరో వ్యక్తి మృతదేహం కనిపించింది. చిన్నయ్యపాలెం దగ్గర టెర్రకాన్ లేఔట్ పొదల్లో 40 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. సబ్బవరం నేషనల్ హైవే ఆనుకొని మృతదేహం లభ్యమైంది. మృతి చెంది 4 రోజులు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
Read Also : Chiranjeevi : నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్
సరిగ్గా నాలుగు రోజులు క్రితం సబ్బవరం సరుగుడు తోటల దగ్గర గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 25_30 సంవత్సరాల మధ్య వయసు కలిగి, గిరిజన తెగకు చెందిన గర్భం దాల్చిన మహిళగా పోలీసులు అనుమానించారు. ఆమె ఎవరో కనిపెట్టేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, రంగంలోకి దిగాయి. కానీ మహిళ శరీరం, ముఖం పూర్తిగా కాలిపోవడంతో ఆమె ఎవరో గుర్తించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆమె ఊహా చిత్రం గీయించి వివిధ స్టేషన్‌లకు పంపించారు సబ్బవరం పోలీసులు. మృతురాలు ఎవరనేది తెలిపిన వారికి 50 వేల బహుమతి కూడా ప్రకటించారు..
ఆ మహిళ కేసు కొలిక్కి రాక ముందే.. ఇప్పుడు మరో డెత్ కేసుతో సబ్బవరం పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అతన్ని అక్కడే చంపేశారా? లేదా ఎక్కడైనా చంపేసి తీసుకు వచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. మొత్తంగా సబ్బవరం ప్రాంతంలో ఇప్పుడు మిస్టరీ మరణాలు చర్చనీయాంశంగా మారాయి.
Read Also : Udaya Bhanu : ఎక్కడ తిట్టాలో వాళ్లే చెప్తారు.. టీవీ షోలపై ఉదయభాను సెటైర్లు..