Bhatti Vikramarka : నగరంలోని సైబర్ గార్డెన్‌లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో కొందరు ఉద్యోగాలు ఇస్తామంటూ మాటలు చెప్పి మోసం చేశారు. అయితే, మేము ప్రజాపాలనలో 112 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నాం” అని చెప్పారు.
“నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. 9,000 కోట్ల రూపాయలతో ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం” అని భట్టి విక్రమార్క తెలిపారు.
“అభివృద్ధి జరగకూడదని కోరుకునే శక్తులు ఉంటారు. వాళ్లను గుర్తించి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం” అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు హాజరై నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్లు, హౌస్ కీపర్స్ వంటి ఉద్యోగాల్లో నియామకాలు జరిగాయి. టీజీపీఎస్సీ ద్వారా ఆర్థిక శాఖలో నియమితులైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లకు కూడా నియామక పత్రాలు అందజేశారు.
28 Degree Celsius Review: 28 డిగ్రీ సెల్సియస్ రివ్యూ..ఆరేళ్ళ క్రితం సినిమా ఎలా ఉంది?