పొలిమేర పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఆయన చేసిన మొదటి సినిమా 2019లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో రిలీజ్ కాలేదు. నవీన్ చంద్ర హీరోగా శాలిని హీరోయిన్ గా రూపొందించిన 28 డిగ్రీ సెల్సియస్ అనే సినిమా సుమారు ఏడేళ్ల తర్వాత ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిమేర ఫ్రాంచైజ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనిల్ మీద నమ్మకంతో పాటు కంటెంట్ కూడా కాస్త ఆసక్తికరంగా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన నేపథ్యంలో సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
28 ° సెల్సియస్ కథ:
కార్తీక్(నవీన్ చంద్ర) ఒక అనాధ. మెడిసిన్ చదువుతున్న కార్తీక్ తన క్లాస్మేట్ అంజలి (శాలిని)తో ప్రేమలో పడతాడు. ఆమెకు ఒక అరుదైన వ్యాధి ఉంటుంది. 28 డిగ్రీల సెల్సియస్ లో కాకుండా కొంచెం పెరిగినా, తగ్గినా సరే ఆమె తట్టుకోలేదు, ఆమె ప్రాణానికే ప్రమాదం. ఇలాంటి క్రమంలో ఆమెకున్న అరుదైన జబ్బుకు జార్జియాలో ట్రీట్మెంట్ దొరుకుతుందని భావించి ఆమెను పెళ్లి చేసుకుని జార్జియా షిఫ్ట్ అవుతాడు కార్తీక్.. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమె వ్యాధిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒకరోజు ఆమె ఇంట్లోనే మరణిస్తుంది. ఆమె మరణాన్ని తట్టుకోలేక మందుకు బానిస అవుతాడు కార్తీక్. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె కమ్యూనికేట్ చేస్తున్నట్టుగానే ఫీలవుతాడు. మరణం తరువాత ఆమె ఆత్మగా వచ్చిందని ముందు భావిస్తాడు కానీ సైన్స్ స్టూడెంట్ కావడంతో అది నమ్మటానికి ఇష్టపడడు. అసలు తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే అతనికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. కార్తీక్ కి తెలిసిన షాకింగ్ విషయం ఏమిటి? టెంపరేచర్ కారణంగానే అంజలి చనిపోయింది కానీ ఆమె చనిపోవడానికి కారణం ఎవరు? చివరికి ఈ విషయం కార్తీక్ తెలుసుకున్నాడా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఇది సుమారు ఆరేళ్ల క్రితం రిలీజ్ కావాల్సిన సినిమా. కాబట్టి దీన్ని అప్పటి మైండ్ సెట్ తో చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమై వెళ్తే బెటర్. ఎందుకంటే టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన సమయంలో ఇలాంటి సినిమా ఎలా అనే అనుమానాలు మీకు కలగొచ్చు. అయితే ఇది కొత్త కథ ఏమీ కాదు. కానీ హీరోయిన్ కి ఉన్న అరుదైన వ్యాధి మాత్రం కాస్త కొత్తగా అనిపిస్తుంది. వినడానికి ఆశ్చర్యం కలిగించేలా ఉన్నా సరే ఇలాంటి వ్యాధి ఉందని గూగుల్ చెబుతోంది. అయితే దాన్ని ఈ స్టోరీకి అల్లుకున్న విధానం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఇక ఆ తర్వాత సినిమా అంతా రొటీన్ గానే సాగిపోతుంది. హీరో హీరోయిన్లు కాలేజీలో ప్రేమలో పడటం, పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవడం, తర్వాత అరుదైన వ్యాధిని తగ్గించుకోవడం కోసం విదేశాలకు వెళ్లడం లాంటి విషయాలు పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆ తరువాత హీరోయిన్ చనిపోవడం, చనిపోయిన తర్వాత హీరోతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు చూపించడం చూసిన తర్వాత ఇది కూడా ఏదో ఆత్మలకు సంబంధించిన కథలాగానే ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్ అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు కూడా. నిజానికి ఇది ఆరేళ్ల క్రితం యాక్సెప్ట్ చేసేవారేమో కానీ ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో యాక్సిప్ట్ చేయలేము. ఎందుకంటే ఇండియాలో సైతం ప్రతి ఇంటికి సీసీ కెమెరా పెట్టేసుకుంటున్న ఈ రోజుల్లో కథలో అలాంటి ప్రస్తావనే లేకుండా మెయిన్ కాన్ఫ్లిక్ట్ రాసుకోవడం కాస్త రియాలిటీకి దూరంగా ఉండే అంశం. దర్శకుడు 28 డిగ్రీల సెల్సియస్ అనే పాయింట్ కొత్తగా ఉందనుకున్నాడు, నిజంగా అది కొత్తగానే ఉంది. కానీ మిగతా విషయాలు విషయంలో కూడా ఆ కేర్ తీసుకుని ఉంటే సినిమా రిసల్ట్ ఇంకా బాగుండేదేమో.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నవీన్ చంద్ర తనకు బాగా అలవాటైన పాత్రలో ఇమిడిపోయాడు. ఎక్కడా కష్టపడిన ఫీలింగ్ కలగకుండానే తనదైన ఈజ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా నటించిన శాలిని అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ మన పక్కింటి అమ్మాయిలా ఒక మంచి పాత్రలో మెరిసింది. ఇక ప్రియదర్శి, వైవా హర్ష వంటి వారు ఉన్న ఎక్కువగా కామెడీ మీద దర్శకుడు ఫోకస్ చేయలేదు కాబట్టి ఉన్నంతలో పర్వాలేదనిపించారు. ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించిన దేవియాని శర్మ ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకి ఒక సర్ప్రైజ్. టెక్నికల్ టీం విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ భలే క్రిస్పీగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. పాటలు పెద్దగా గుర్తించుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టు సెట్ అయింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది కానీ ఇంకా కత్తెరకు పని చెప్పొచ్చు.
ఓవరాల్ గా ఈ 28 ° సెల్సియస్ సినిమా ఓ హానెస్ట్ అటెంప్ట్.. బట్ లేట్..