Bihar Political Crisis: దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన తర్వాత బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బీజేపీ నేతలతో నితీష్‌కుమార్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం.. వారితో కలిసి నవ్వులు చిందించడంతో అప్పుడే సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయని సంకేతాలు వెళ్లాయి. అనుకున్నట్టుగానే మహాకూటమి నుంచి నితీశ్ బయటకు వచ్చేశారు. వారం రోజులుగా కొనసాగుతున్న పొలిటికల్ డ్రామాకు ఆదివారంతో తెరపడింది.
Read Also: PM Modi : రాముడి ప్రాణప్రతిష్ట కోట్లాది మందిని కట్టిపడేసింది.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీజేపీతో జేడీయూ జతకలిసింది. నితీష్‌కుమార్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీ నుంచి నితీష్ బయటకు వచ్చేసి ఆర్జేడీతో జతకట్టారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, సీపీఐ(ఎం), హెచ్‌ఏఎం అనే ఏడు పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అప్పుడు కూడా నితీష్‌కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కి డిప్యూటీ సీఎంతో పాటు పలువురికి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ మొదట నుంచీ ఆర్జేడీతో సరైన సఖ్యత లేదు. ప్రభుత్వంలో ఆర్జేడీ మితిమీరిన జోక్యం ఎక్కువ కావడంతో నితీష్ విసిగిపోయినట్లుగా తెలుస్తోంది. నితీష్‌ను సంప్రదించకుండానే తేజస్వీ యాదవ్ పలు నిర్ణయాలు తీసేసుకోవడం నితీష్‌కు ఏ మాత్రం నచ్చలేదని సమాచారం. ఈ పరిణామాలతో ఆయన మహాకూటమి నుంచి బయటకే వచ్చేందుకు సమయం కోసం ఎదురుచూసినట్లుగా తెలుస్తోంది.
Read ALso: Bihar Crisis: ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్ రాజీనామా.. నెక్ట్స్ ఏంటంటే..!
ఇక ఇండియా కూటమి ఏర్పడడానికి నితీష్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయా రాజకీయ పార్టీలను సమన్వయం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. కానీ అనంతరం జరిగిన పరిణామాలు ఆయనకు రుచించినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియా కూటమి అధ్యక్షుడిగా నితీష్‌ను కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారని సమాచారం. పైగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్.. నితీష్‌ను కాకుండా ఖర్గేకు మద్దతు తెల్పడంతో అప్పట్నుంచీ ఆయన మనస్తాపం చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో తనకు ప్రాధాన్యత లేనప్పుడు.. అందులో ఉండడం ఉపయోగలేదనే నితీష్ బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ, మల్లిఖార్జన ఖర్గే పలుమార్లు ఫోన్ చేసినా నితీష్ కనీసం స్పందించలేదంటే పరిస్థితులు ఎంతవరకు వెళ్లాయో చెప్పకనే చెప్పొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా నిష్క్రమించింది. మరీ ఇండియా కూటమి పరిస్థితి భవిష్యత్‌లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.