Bihar Crisis: బీహార్ రాజకీయ సంక్షోభం చివరంఖానికి చేరుకుంది. అంతా ఊహించినట్టుగానే మహాకూటమికి నితీష్‌కుమార్ గుడ్‌బై చెప్పేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి నితీష్ రాజీనామా లేఖను సమర్పించారు. అంతకముందు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజీనామాకు గల కారణాలను ఎమ్మెల్యేలకు నితీష్ తెలియజేశారు. నితీష్‌కుమార్ మాట్లాడుతూ..”గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించాను.. సీఎం పదవికి రాజీనామా చేశాను.. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం.. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చా.. ఇండియా కూటమి బలహీనపడింది.” అని నితీష్ అన్నారు.
గత మూడు, నాలుగు రోజులుగా బీహార్ ప్రభుత్వంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం వచ్చిదంటూ వార్తలు షికార్లు చేశాయి. కానీ నితీష్‌కుమార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి పొలిటికల్ సస్పెన్స్‌కు తెరలేపుతూ మహాకూటమి నుంచి నితీష్ బయటకు వచ్చేశారు. మరోసారి బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. పట్నాలో ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఏం చూసిస్తే అలా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే జేపీ నడ్డాతో సహా పలువురు బీజేపీ ముఖ్యనేతలు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు బీహార్‌కు చేరుకోనున్నారు. అనంతరం నితీష్‌కుమార్‌తో సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ఏడోసారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
బీహార్‌లో ప్రస్తుతం ఇలా..
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. కనీస మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78కి, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎస్)కు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసే ఉన్నాయి. ఈ మూడు పార్టీల బలం 114 మంది ఉన్నారు. మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. జేడీయూ-బీజేపీకి మాత్రమే 123 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే బలం ఉంది.