పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా వుండవు. కరువు కేరాఫ్ అడ్రస్ గా భావించే అనంతపురంలో రోజులు మారాయి. కరువు సీమలో నీటి జాడలు పెరిగాయి. నిత్యం తాగు, సాగు నీటి కోసం అల్లాడిపోయే అనంతపురం జిల్లాలో పరిస్థితులు మారాయి. కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో ఎన్ని జలాశయాలు ఉంటే అన్నింటిలోనూ నీటి పరవళ్లు కనిపిస్తున్నాయి. దాదాపుగా అన్ని జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఏకంగా 60 వేల క్యూసెక్కుల నీరు ఒక్క జిల్లాలోనే విడుదల చేశారంటే కరవు ప్రాంతంలో నీటి ప్రవాహాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కరవు సీమలో ఈ స్థాయిలో నీటి ప్రవాహాలు ఎక్కడి నుంచి వచ్చాయి…
అనంతపురం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది కరవు. ఇక్కడ నీటి కోసం నిత్యం అవస్థలు పడడమే కాదు. యుద్ధాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ప్రాంతానికి నీరు కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ నేతలు గొడవలుకు దిగిన సందర్భాలు మనం చాలా చూశాం. కానీ అనంత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు జలాశయాల్లో నీరు పరవళ్ళు తొక్కుతోండి. అనంతపురం జిల్లాలో నీటి ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఏ ప్రాజెక్టును చూసినా నీటితో కళకళలాడుతోంది. నీటి ఉద్భత్తి ఎక్కువ కావడంతో క్రస్టుగేట్లు ఎత్తి దిగువకు నీటి అధికారులు వదులుతున్నారు. అన్ని ప్రాజెక్టుల్లోనూ కలిపి సుమారు 60 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్న అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకేసారి అన్ని ప్రాజెక్టుల్లోకి నీరు చేరి దిగువకు వదలడం చాలా కాలం తరువాత జరిగిందని చెప్పాలి.
అసలు కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఈ స్థాయిలో నీరు రావడానికి ప్రధానమైన కారణం కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలే అని చెప్పాలి. కర్ణాటకలో గత నెల నుంచి కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజెక్టులన్ని పొంగిపొర్లుతున్నాయి. వాస్తవంగా ఏపీకి రావాల్సిన నీటిని కూడా ఆపుతూ వారు అక్కడ అక్రమ ప్రాజెక్టులు కట్టారు. అయితే ఆ ప్రాజెక్టులన్ని తెగిపోయే స్థాయిలో నీటి ప్రవాహాలు రావడంతో అనంతకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా పెన్నా నదిపై జిల్లాలో తొలి ప్రాజెక్టుగా ఉన్న పేరూరు కు పెద్ద ఎత్తున వరద వస్తోంది. పేరూరు ప్రాజెక్టు నుంచి జిల్లాలో అతిపెద్ద పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు భారీగా నీరు చేరింది. 14ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం పది టిఎంసిలు అయినప్పటికీ ఐదు టిఎంసిల వరకు నిలువ ఉంచేందుకు వీలుంది.
Read Also: Nithyananda: విషమంగా నిత్యానంద ఆరోగ్యం.. కాపాడాలంటూ శ్రీలంక అధ్యక్షుడికి లేఖ
దీంతో ఐదు టిఎంసిల కంటే అధికంగా నీరు రావడంతో నాడు ఆరు గేట్లను ఎత్తి 15,900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ ప్రాజెక్టు కిందనున్న మిడ్ పెన్నార్ కూడా నిండింది. ఐదు టిఎంసిల నిలువ
సామర్ధ్యమున్న ఈ ప్రాజెక్టు నిండటంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 8 గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పెన్నానదిలోకి ఈ నీటిని వదలడంతో చాలాకాలం తరువాత పెన్నా నది ఉద్భతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టు కిందనున్న చాగళ్లు కూడా నిండింది. చాగళ్లు గేట్లు ఎత్తి పది వేల క్యూసెక్కుల నీటి దిగువకు వదిలారు. సందర్శకుల తాకిడి అధికం కావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వరదనీటితో లోతట్టు ప్రాంతాల్లో పంటలు మునిగిపోయాయి. జయపురం, ఎంఎంహళ్ళి, శివరాంపేట, ఉదిరిపికొండ, ఉదిరిపికొండ తండా, తదితర గ్రామాల్లో దానిమ్మ, వరి, టమోట, వేరుశనగ తదితర పంటలు నీట మునిగాయి.
మరోవైపు ఎగువన కర్నాటకలో కురుస్తున్న భారీవర్షాలకు అక్కడి మారికనవి వద్ద ఉన్న వాణీవిలాస్ ప్రాజెక్టు నుండి అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో గల భైరవానితిప్ప ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో గురువారం రిజర్వాయర్ కి ఉన్న 12 గేట్లలో 5 గేట్లు 4 అడుగులు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.నది వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. గుండ్లపల్లి, కనేకల్, బొమ్మనహాల్ మండలాల్లోని పలుచోట్ల రాకపోకలు ఆగిపోయాయి. వరిపొలాలు నీటమునిగాయి. ముదిగుబ్బ మండలంలోని యోగివేమన రిజర్వాయర్ లో పెద్ద ఎత్తున నీరు రావడంతో.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇటు హిందూపురం ప్రాంతంలో చిత్రావతి, జయమంగళీ పెన్నార్ కముద్వితీ నదులు కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహాలతో కళకళలాడుతున్నాయి. దాదాపు ఐదారు దశాబ్దాల క్రితం కూడా ఇలాంటి నీటి ప్రవాహాలు చూడలేదని జిల్లా వాసులు చెబుతున్నారు. కానీ ఈ నీటి ప్రవాహాల వలన వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదుకోవాలన్న విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Nithyananda: విషమంగా నిత్యానంద ఆరోగ్యం.. కాపాడాలంటూ శ్రీలంక అధ్యక్షుడికి లేఖ