తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదని వైసీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు అందర్నీ క్రిమినల్ అంటారని, ఆయనే ఓ క్రిమినల్ అని తెలుసుకోడన్నారు. బాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు.. అందులకే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడని మండిపడ్డారు. హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారని, రోజుకో సమస్య తెచ్చి దాని మీదే కాలం గడుపుతున్నారన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… ‘సీఎం చంద్రబాబుకు మతి భ్రమించింది. ఆయన ఓ క్రిమినల్. అందర్నీ క్రిమినల్ అంటారు కానీ.. ఆయనే ఓ క్రిమినల్ అని తెలుసుకోడు. చంద్రబాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు. తను జైలుకు వెళ్లానని నాతో సహా అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడు. హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారు. అందుకే రోజుకో సమస్య తెచ్చి దాని మీదే కాలం గడుపుతున్నారు. కేవీరావు ఓ బ్రోకర్. ఆయనకు అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నాడు?. కేవీరావు చంద్రబాబు చెంచా. కేవీరావు ఫిర్యాదు మీద విచారణే లేకుండా నేరుగా కేస్ ఫైల్ చేయడం ఓ డ్రామా’ అని అన్నారు.
‘మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. సీఎం చంద్రబాబు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదు. కెవీరావు ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేస్తుంటాడు. ఆయన్ను విక్రాంత్ రెడ్డి భయపెట్టడమా?. చంద్రబాబు చేతిలో రాష్ట్రం నాశనం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. చంద్రబాబుకు పాలనే చేతకాదు. మీరు మీ నాయకుడిని మార్చుకోండి. లోకేష్ అసమర్ధుడు.. ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తండ్రీ, కొడుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి తొలగించి రాష్ట్రాన్ని కాపాడండి. కేవీరావు పెద్ద బ్రోకర్ అని, రాష్ట్రాన్ని ఏలా దోచేశాడో 2012లోనే పవన్ కల్యాణ్ చెప్పారు. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారు. వచ్చే వారంలో చంద్రబాబు, కేవీరావుపైన హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నా. నేను ఎక్కడికైనా వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి కావాలి. అది తెలిసీ నాకు లుక్ అవుట్ నోటీస్ ఇవ్వడం ఏంటి?. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే లుక్ అవుట్ నోటీస్ పంపారు. చంద్రబాబు మీద కేస్ పెడతాం’ అని విజయసాయి రెడ్డి చెప్పారు.