Union Minister Bandi Sanjay made strong comments on Congress and BRS: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు, తప్పిదాల ఫలితంగా రాష్ట్రం ఏ విధంగా దివాళా తీసిందో శాసనసభ సాక్షిగా ఈరోజు బయటపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.6 లక్షల 71 వేల 756 కోట్లు అప్పు చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.. అదే సమయంలో ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1 లక్షా 27 వేల కోట్లకుపైగా అప్పులు చేసినట్లు కూడా అసెంబ్లీ సాక్షిగా వెల్లడైందన్నారు. ఈ రెండు పార్టీలను గెలిపించి అధికారం కట్టబెట్టిన పాపానికి రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారు.. ప్రజల చేతికి చిప్ప అందించారని బండి సంజయ్ ఆరోపించారు.
Read Also: Mumbai: ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో ఐశ్వర్య దంపతుల సందడి
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఈ రెండు పార్టీల స్వార్ధ ప్రయోజనాలు, దివాళాకోరు విధానాలవల్ల చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే కొత్తగా మళ్లీ అప్పులు తీసుకునే దుస్థితి ఏర్పడటం అత్యంత బాధాకరం అని బండి సంజయ్ అన్నారు. దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సిద్దమైందని తెలిపారు. వాస్తవానికి అధికారంలోకి రావడానికి ముందే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అనేక సభల్లో చెప్పారని అన్నారు. అయినప్పటికీ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడంతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ప్రకటించారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక అప్పులను సాకుగా చూపి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా దాటవేత ధోరణిని అవలంబించడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తీరును చూస్తుంటే బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్నట్లు స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కన్పిస్తోందని విమర్శించారు.
Read Also: KTR: ఫార్ములా ఈ- కార్ రేస్ కేసుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. అప్పులు తీసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీని మించి పోయిందన్నారు. ఒక ఏడాదిలోనే రూ.1,27 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకుందంటే.. మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని కలిపి రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకునే పరిస్థితి కళ్లముందే కన్పిస్తోందని తెలిపారు. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రం ఊహించనంతగా ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడే ప్రమాదముంది.. ఈ అప్పులను తీర్చడానికి ప్రజలపై మోయలేనంతా పన్నుల భారాన్ని వేసే ప్రమాదముందని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రాజకీయాలకు అతీతంగా మేధావులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులతో పాటు తెలంగాణ శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని బండి సంజయ్ కోరారు. రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలుకాకుండా ఉండేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి 6 గ్యారంటీలను అమలు చేయించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత ఉద్యమాలను ఉధృతం చేస్తామని వెల్లడించారు.