నేడు నంద్యాలలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంత సిద్ధం బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులోని రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. ఇక, ఆ తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని సాయంత్రం 4 గంటలకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్న కొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ గూడూరు మండలం నాగులాపురంలో సీఎం జగన్ రాత్రికి బస చేయనున్నారు. ఇక, తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 131 కిలో మీటర్ల మేర జగన్ బస్సు యాత్ర కొనసాగింది.
నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలలో బాబు పర్యటన..!
నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాలలో ప్రజాగళం పేరిటన ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగం చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాల మైదానం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. ఆపై 10:45 నిమిషాలకు గాను ప్రసన్ననాయపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గం గుండా 11 గంటలకు రాప్తాడు బస్టాండ్ కు చేరుకోనున్నారు. అక్కడే 12:30 కు బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 2:00 వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఇక మధ్యాహ్న భోజనం తర్వాత 02:00 నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 02:30 గంటలకు బుక్కరాయసముద్రం సబ్ స్టేషన్ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ 02:30 నుండి 04:00 వరకు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ సభ తర్వాత 5:10 నిమిషాలకు ప్రసన్నాయపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దిగుతారు. ఆ తర్వాత నగరంలోని మహిళా కళాశాల కుడలిలో 05:50 నిమిషాల నుంచి 7:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి మదనపల్లికి చేరుకోనున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు నేటి పర్యటనలో భాగంగా మూడు సభలలో ప్రసంగనించనున్నారు.
టీడీపీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే..?
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నేడు కార్యకర్తలతో తన స్వగృహంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. మా కుటుంబాన్ని నమ్ముకుని 40 ఏళ్లుగా పోరాడుతున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటానంటాను అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇక, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని అంటూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాక్షసులతో ప్రత్యక్ష యుద్ధం చేసిన తనపై 39 అక్రమ కేసులు, భౌతిక దాడులు, జైలు జీవితం, హత్యకు సఫారీ 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు, లాఠీ దెబ్బలు, 24 గంటలు ప్రజల కోసమే పోరాటం చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఇవేవీ తనను కాపాడలేకపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తనకు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయిన తాను ఈసారి ఎన్నికల బరిలో ఉంటాను అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
మహబుబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దం..
మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దం అయింది. నేడు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ సరళి కొనసాగనుంది. ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును స్థానిక సంస్థల ఓటర్లు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇక, కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో తన ఎక్స్ అఫిషియో ఓటును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగించుకోనున్నారు. మహబుబ్ నగర్, వనపర్తి, గద్వాల, కొడంగల్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్ నగర్ లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల బందోబస్తు,144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీంల ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించనున్నారు.
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. పెద్దెతున ఎగిసిపడుతున్న మంటలు..!
నేటి ఉదయం హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఓ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో బిస్కెట్ తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాటేదాన్ లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో నేటి ఉదయం ఒక్కసారిగా మంటలు చలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పోగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో మంటలు క్రమంగా ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులకు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఇంకా అసలు కారణం తెలియ రాలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ..
నేటితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు రిమాండ్ ముగియడంతో ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తుకు సంబంధించి ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులో సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 14 మందిని నిందితులుగా పేర్కొంది. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ఇక, లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ నేటితో ముగుస్తుంది. దీంతో కేజ్రీవాల్‌ను నేటి మధ్యాహ్నం 2 గంటలకు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించారు. ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై తమ సమాధానం దాఖలు చేసేందుకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీకి ఏప్రిల్ 2 వరకు గడువు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 3న జరగనుంది. అలాగే, తనను, తన పార్టీని నిర్వీర్యం చేసేందుకే.. నన్ను ఉద్ధేశపూర్వకంగా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వాదించారు.
మహువా మొయిత్రాకు నేడు విచారణ రావాలని ఈడీ నోటీసులు..!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణానగర్ లోక్ సభ అభ్యర్థి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత అయిన మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ విషయం సంబంధించి ఇదివరకే రెండుసార్లు సమన్లు పంపించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈమెను విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకావాలంటూ ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. అలాగే దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి కూడా సమన్లను జారీ చేసింది. ఈ కేసులో ఆమెను అధికారులు నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు సంబంధించిన నగదు చెల్లింపుల గురించి, వివిధ అకౌంట్స్ గురించి అలాగే వాటి లావాదేవీల గురించి ప్రశ్నించబోతున్నారు. గత సంవత్సరం ఆమె స్నేహితుడు న్యాయవాది అయిన జై అనంత్ దేహత్రయ పై కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా దర్శన్ హీరానందానికి పార్లమెంటుకు సంబంధించిన పాస్వర్డ్ ను మహువా మొయిత్రా ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
RC16 నుంచి అదిరిపోయే అప్డేట్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ గురించి చెప్పనక్కర్లేదు.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు.. ఇప్పటికే ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.. అలాగే సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం 2 చేయబోతున్నారు.. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా చేశారు.. ఈ సందర్బంగా ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి బుచ్చిబాబు, మైత్రి నిర్మాతలు, దిల్ రాజు, డైరక్టర్ బాబీ, మంచు మనోజ్ వంటి వారు హాజరైయ్యారు.. ఈ సందర్బంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ.. రామ్ చరణ్ rc16 నుంచి అదిరిపోయే అప్డేట్స్ ను ఇచ్చారు.. ఈ సినిమా అప్డేట్ కావాలని కోరగా.. బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలోని మూడు పాటలు కంప్లిట్ అయ్యాయి.. రెహమాన్ సార్ అద్భుతంగా మ్యూజిక్ అందించారు. అందులో మొదటి పాటతో బ్లాస్టింగ్ అయిపోతుంది అంటూ అంచనాలు పెంచేశాడు. ఫస్ట్ సాంగ్ నుంచే ఆ మొమెంటమ్ మొదలవుతుందని తెలిపాడు. ఆ మాట వినగానే ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.. బుచ్చిబాబు ఇచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచుతున్నాయి.. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను త్వరగా పూర్తి చేసి, తర్వాత సినిమాలను పట్టాలెక్కించాలని రామ్ చరణ్ చూస్తున్నాడు.. చరణ్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ అయిన జరగండి సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఉప్పల్ లో నమోదైన సరికొత్త రికార్డులివే..!
బుధవారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ తలబడ్డాయి. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి హైదరాబాద్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసారు. ఇరు జట్లు ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు ఆకాశమ హద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన టీం గా రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష చేదనలో బ్యాటింగ్ వచ్చిన ముంబై బ్యాటర్స్ కూడా తామేమి తక్కువ కాదంటూ టార్గెట్ చాలా దూరం ఉన్నా కానీ.. తమ సాయశక్తుల ప్రయత్నించారు. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి. వాటికి సంబంధించిన వివరాలు చూస్తే.. ఈ మ్యాచ్ లో మొత్తంగా 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ లోని ఓ మ్యాచ్ లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. ఇదే మ్యాచ్ లో తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్ సాధించిన స్కోరు 148 పరుగులు. దీంతో గతంలో 2014లో పంజాబ్, 2021లో ముంబయి చేసిన 131 పరుగుల రికార్డు బ్రేక్ అయింది. అలాగే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన స్కోరు 277/3. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు. గతంలో 2013 లో పుణె వారియర్స్ పై ఆర్సీబీ సాధించిన 263/5 పరుగుల రికార్డ్ ను బ్రేక్ చేసారు.