నేడు మరో 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధంమవుతోంది.. మరో రెండు రోజుల్లో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి.. ఇక, ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు మరో మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు.. ఉదయం 10.35 గంటలకు కర్నూలు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సర్కిల్ లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఇక, అనంతరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జగన్.. మధ్యాహ్నం 1:30 గంటలకు సభ ఉద్దేశించి మాట్లాడనున్నారు.. ఇక, అక్కడ నుంచి అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్తారు వైసీపీ అధినేత.. రాజంపేట లో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ ఉండనుంది.. పాత బస్టాండ్ కూడలిలో మధ్యాహ్నం 3 గంటలకు సభ నిర్వహించనున్నారు.. ఈ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.. మొత్తంగా ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్.. ఇక, జగన్ సభలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.
హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా నగదు తరలింపు.. రూ.8.39 కోట్లు సీజ్
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.. హైవేలు, ఇతర రోడ్లు అనే తేడా లేకుండా చెక్‌పోస్టులు పెట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.. ఇలా ఇప్పటికే కోట్లాది రూపాయలు పోలీసుల తనిఖీల్లో సీజ్ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. తాజాగా భారీగా నగదు సీజ్ చేశారు.. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో భారీగా క్యాష్ తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.. దీంతో.. తనిఖీలు విస్తృతంగా చేశారు.. ఆ తనిఖీల్లో ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుగుతున్నారు. ఈ క్యాష్ ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు.. ఎవరు ఇచ్చారు? లాంటి విషయాలపై కూపీలాగుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల టైం.. పట్టుబడుతోన్న నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు, లిక్కర్ బాటిల్స్
పార్లమెంటు ఎన్నికల వేళ హైదరాబాద్‌లో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు.. భారీగా డబ్బు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు.. అనుమానాస్పదంగా ఉన్న రెండు హోండా యాక్టివా వాహనాలను పట్టుకున్నారు. లెక్కల్లో చూపని 22 లక్షలు స్వాధీనంచేసుకున్నారు. మేడ్చల్ టౌన్ లో వాహన తనిఖీలు చేసిన SOT పోలీసులు.. SISCO సేఫ్ గార్డ్ వాహనంలో 5 సీల్డ్ బాక్స్‌లలో దాదాపు 25 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు…కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ దేవ్ హాస్పిటల్ సమీపంలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు..4 కేజీల బంగారం, 4 కిలోల వెండి, స్వాధీనంచేసుకున్నారు. వీటి విలువ 2 కోట్ల 66 లక్షల పైచిలుకు ఉంటుందని అంచనా. ఇక, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్మును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గొల్లపూడిలోని ఆలూరి సురేష్ ఇంటిలో కోటి రూపాయలను సీజ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపకాలు జోరుగా సాగుతున్నాయి. కంటోన్మెంట్ బోయిన్ పల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ను గెలిపించడానికి డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. పెద్దసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో…కాంగ్రెస్ కార్యకర్తలు పరారయ్యారు. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. తాజాగా భారీగా నగదు సీజ్ చేశారు.. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో భారీగా క్యాష్ తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.. దీంతో.. తనిఖీలు విస్తృతంగా చేశారు.. ఆ తనిఖీల్లో ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుగుతున్నారు. ఇలా ఎక్కడ పట్టుబడిన.. భారీగా నోట్ల కట్టలు, బంగారం, వెండి కడ్డీలు.. లిక్కర్ బాటిళ్లు.. పెద్ద సంఖ్యలో పట్టుపడుతూనే ఉన్నాయి.
మరో నాలుగు రోజులు వానలే.. ఎల్లో అలర్ట్ జారీ..
మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఎన్నికలు జరిగే మే 13న తెలంగాణ, ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుంచి కనిష్టంగా 24 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన..
ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ లోక్ సభ నియోజకవర్గాల్లో విజయభేరి మోగించాలనే ఉత్సాహంతో ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తరచూ బహిరంగ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మిగిలి ఉండడంతో హస్తం పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేల పర్యటనల షెడ్యూల్‌ను పీసీసీ వెల్లడించింది. ఈ నలుగురు నేతలు ఎప్పుడు, ఎక్కడ పాల్గొంటారనే షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పర్యటిస్తారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జన జాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారని పీసీసీ తెలిపింది. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని సమాచారం.
నేడు కరీంనగర్‌లో కేసీఆర్ రోడ్ షో.. తెలంగాణచౌక్ వరకు ర్యాలీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు కరీంనగర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. గులాబీ దళపతి హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి మీదుగా వచ్చి నగరంలోని బైపాస్ రోడ్డు మీదుగా రాంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. రాంనగర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమై మంకమ్మతోట, టూటౌన్ పోలీస్ స్టేషన్, ముకరంపుర మీదుగా తెలంగాణచౌక్‌కు చేరుకుంటుంది. అక్కడ నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ పాలనకు, నేటి కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించనున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని తన ముందుంచనున్నారు. ముఖ్యంగా ఎంపీగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానే కాకుండా మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, తనతో కలిసి పోటీ చేస్తున్న వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి గెలవాల్సిన ఆవశ్యకతను వివరించనున్నారు. నేటి కేసీఆర్ రోడ్‌షోకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారు. ఈ రాస్తారోకోను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో రోడ్‌షో నిర్వహించేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ సభ అనంతరం కరీంనగర్ తీగలగుట్టపల్లిలో బస చేయనున్నారు. అనంతరం రేపు (శుక్రవారం) సాయంత్రం సిరిసిల్లలో నిర్వహించే రాస్తారోకోకు వెళ్తారు. అనంతరం సిద్దిపేటలో జరిగే రాస్తారోకోలో పాల్గొంటారు.
కొవిషీల్డ్ తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన తయారీ సంస్థ
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బాంబు పేల్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఈ వ్యాక్సిన్ (కొవిషీల్డ్)ను అభివృద్ధి చేసింది. ఇదే వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరం ఇనిస్టిట్యూట్ తయారుచేసింది. దేశంలో అత్యధికంగా తీసుకున్న టీకా ఇదే. కాగా జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈటీకా తీసుకున్న చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ టీకా ఒకరి మృతికి కారణం కావడంతోపాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్టు కేసు నమోదైంది. జరిగిన నష్టానికి 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1000 కోట్లు) పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో దావా నమోదైంది. ఏప్రిల్ 2021లో ఈ టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో తన మెదడు శాశ్వతంగా దెబ్బతిందని జామీ స్కాట్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ కారణంగా తాను ఉద్యోగం చేయలేకపోయానని, తాను చనిపోబోతున్నట్టు వైద్యులు తన భార్యతో చెప్పారని పేర్కొన్నాడు. దీంతో అసలు విషయం బయట పడింది.
కొత్త కారుకి ఆలయంలో పూజలు.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!
ఓ కొత్త కారు ఆలయంలో బీభత్సం సృష్టించింది. పూజలు చేస్తుండగా హఠాత్తుగా ముందుకు దూసుకుపోయింది. నేరుగా వెళ్లి ఆలయ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ముందు భాగంగా పూర్తిగా దెబ్బతింది. ఈ పరిణామంతో అక్కడున్న భక్తులంతా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా శ్రీముష్ణం ప్రాంతంలోని ఒక ఆలయంలో జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి కొత్త కారు కొనుగోలు చేశాడు. అనంతరం ఆలయంలో పూజలు చేయించేందుకు తీసుకొచ్చాడు. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత.. స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. పొరపాటున యాక్సిలరేటర్‌ను నొక్కగా ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. నేరుగా వెళ్లి ఆలయ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. యజమాని మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. అలాగే ఆలయంలో ఉన్న భక్తులకు కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
పీఓకే భారత్లో అంతర్భాగం.. త్వరలోనే ప్రజల కోరిక నెరవేరుతుంది..
ఢిల్లీ యూనివర్శిటీలోని గార్గి కాలేజీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పీఓకేను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు పూర్తిగా భిన్నమైన నమ్మకాలు ఉండగా.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం ఎలా రద్దు చేసిందో చెప్పారు. ఇక, పీఓకేలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై రాజకీయ, మానవ హక్కుల సంస్థలు లాంగ్ మార్చ్ చేశాయని జైశంకర్ అన్నారు. అలాగే, పీఓకికి సంబంధించి పార్లమెంటులో ఒక తీర్మానం చేయడం ద్వారా దానికి దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలిపిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. దీని వల్ల మన దేశంలో అంతర్భాగమైన PoKని భారతదేశానికి తిరిగి తీసుకోచ్చేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. POK భారతదేశం నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని ఆయన తెలిపారు. పీఓకే ఈ దేశం వెలుపల ఎన్నడూ లేదని, పీఓకే పూర్తిగా భారత్‌లో భాగమని ఇప్పటికే పార్లమెంట్ లో తీర్మానం చేసిందన్నారు.
ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కీలక పోరు.. ప్లేఆఫ్ కోసం ఫైట్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. కాగా, హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆర్సీబీ జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇక, మరోవైపు, గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఈ మ్యాచ్ లో గెలిచేందుకు పంజాబ్ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతుంది. కాగా, ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మొత్తం 32 సార్లు తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందగా, పంజాబ్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ వరుస విజయాలను నమోదు చేయగా.. ఈ సీజన్‌లో పంజాబ్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలవగా, ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఇవాళ గెలిచిన జట్టు ప్లేఆఫ్ అవకాశలు మెరుగ్గా ఉంటాయి.. ఓడిపోయిన టీమ్ దాదాపు ఈ మెగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్లే అని చెప్పొచ్చు..
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి
బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సంగీత్ శివన్ బుధవారం మరణించారు. సంగీత్ శివన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంగీత్ శివన్ వయసు కేవలం 65 ఏళ్లు మాత్రమే. సంగీత్ శివన్ మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దర్శకుడు శివన్ మృతి పట్ల బాలీవుడ్ సహా సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన సంగీత శివన్ ‘క్యా కూల్ హై హమ్’, ‘అప్నా సప్నా మనీ మనీ’ వంటి కామెడీ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు శివన్ మరణ వార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శివన్ మృతి పట్ల బాలీవుడ్ స్టార్ రితీష్ దేశ్‌ముఖ్ సంతాపం వ్యక్తం చేశారు. సంగీత్ శివన్ మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు సినీ తారలందరూ సంతాపం వ్యక్తం చేశారు. రితేష్ దేశ్‌ముఖ్ తన సోషల్ మీడియాలో శివన్ చిత్రాన్ని పంచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు. సంగీత శివన్ సౌత్ సినిమాలో కూడా ఎన్నో సినిమాలు చేశారు. మలయాళ సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంగీతా శివన్ బాలీవుడ్‌కి కూడా హిట్ సినిమాలు అందించాడు. ఇక సంగీత్ రఘువరన్ నటించిన వ్యూహం (1990)తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 1997లో సన్నీడియోల్ నటించిన ‘జూర్’ సినిమాతో బాలీవుడ్‌లో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఇక ఆ అనంతరం బాలీవుడ్లో సంధ్య, చురలియా హై తుమ్నే, క్యా కూల్ హై తుమ్, అప్నా సప్నా మణి మణి, ఏక్ – ది పవర్ ఆఫ్ వన్, క్లిక్ మరియు యమ్లా పగ్లా దీవానా 2 అనే హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సౌత్ సినిమాతో పాటు బాలీవుడ్‌లో కూడా శివన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివన్ మృతితో బాలీవుడ్, మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఓటీటీలోకి వచ్చేసిన గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ “గీతాంజలి” సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కింది.ఈ సినిమా హీరోయిన్ అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కింది.శివ తుర్లపాటి ఈ హారర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించదాంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.”గీతాంజలి మళ్ళీ వచ్చింది” మూవీ ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ మూవీ మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో హీరోయిన్ అంజలి మంచి హిట్ అందుకుంటుందని అంతా భావించారు.కానీ ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.ఇదిలా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నెల లోపే ఓటిటిలోకి వచ్చింది.’గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని మే 8 స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. కానీ సాయంత్రం అయ్యేవరకు కూడా ఈ సినిమా ఓటిటికి రాకపోవడంతో ఈ సినిమా వస్తుందా రాదా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలైంది .అయితే ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది.